జార్ఖండ్‌ను చేజార్చుకొన్న బిజెపి

బిజెపి చేతిలో నుంచి మహారాష్ట్ర తరువాత జార్ఖండ్‌ రాష్ట్రం కూడా చేజారిపోయింది. జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలలో జెఎంఎం, కాంగ్రెస్‌, ఆర్‌జెడీ కూటమి తిరుగులేని విజయం సాధించింది. జార్ఖండ్‌ అసెంబ్లీలో మొత్తం 81 స్థానాలున్నాయి. వాటిలో జెఎంఎం, కాంగ్రెస్‌, ఆర్‌జెడీ కూటమి 47 స్థానాలు గెలుచుకోగా, అధికార బిజెపి 25 స్థానాలు మాత్రమే గెలుచుకోగలిగింది. దాంతో జార్ఖండ్‌ ముఖ్యమంత్రి రఘుబర్ నిన్న ఆ రాష్ట్ర గవర్నర్‌ ద్రౌపది ముర్ముని కలిసి తన రాజీనామాపత్రం అందజేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడేవరకు ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. 

త్వరలో ముఖ్యమంత్రి కాబోతున్న జెఎంఎం అధినేత హేమంత్ సొరేన్‌కు ప్రధాని నరేంద్రమోడీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ పలువురు ప్రముఖులు అభినందనలు తెలియజేశారు. 

ప్రభుత్వ ఏర్పాటుకు 41 సీట్లు అవసరం కాగా జెఎంఎం, కాంగ్రెస్‌, ఆర్‌జెడీ కూటమి 47 స్థానాలు గెలుచుకొని పూర్తి మెజారిటీతో అధికారంలోకి వస్తునందున బిజెపి వారి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు చేయకపోవచ్చు. కనుక జార్ఖండ్‌లో జెఎంఎం, కాంగ్రెస్‌, ఆర్‌జెడీ కూటమి 5 ఏళ్ళు సుస్థిరంగా పాలన చేసుకోగలదు.