
తెరాస ఎమ్మెల్యే శంకర్ నాయక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా సోమవారం కేసముద్రంలో పేదలకు దుస్తులు పంపిణీ కార్యక్రమం జరిగింది. దానిలో పాల్గొన్న ఎమ్మెల్యే శంకర్ నాయక్ ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ,” మనుషులకు మూడు రకాల బలుపు ఉంటుంది. ఒకటి కులం, రెండు డబ్బు, మూడు చదువు వలన కలిగే బలుపు. వెలమ,రెడ్డి కులస్తులకు, డబ్బున్నవారికి, బాగా చదువుకొన్నవారికి తమకంటే తక్కువ వారిపట్ల చులకనభావం ఉంటుంది. మనుషులు అందరిలో ప్రవహించే రక్తం ఒకటే. అందరూ తినే తిండి, పీల్చే గాలి, త్రాగే నీళ్ళు ఒక్కటే..కానీ ఈ కులాల అహంభావం, అంతరాలు ఎందుకు? వాటికి అతీతంగా అందరినీ ఆదుకోగలగడమే మానవత్వం,” అని అన్నారు.
డబ్బు, చదువున్నవారికి అహంకారం ఎక్కువ అని చెప్పినందుకు శంకర్ నాయక్‌ను ఎవరూ తప్పు పట్టరు కానీ ఆయన రెండు కులాలు పేర్లు చెప్పి వారికి అహంభావం ఎక్కువ అని చెప్పడమే వివాదాస్పదం అయ్యింది. తెరాస అధిష్టానం వెలమసామాజిక వర్గానికి చెందిన సంగతి తెలిసిందే. అలాగే ప్రభుత్వంలో, పార్టీలో రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే ఎక్కువగా ఉన్నారు. బహుశః ఆ రెండు వర్గాల మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతల నుంచి ఆయన అవమానాలు ఎదుర్కొన్నందునే ఆవిధంగా అన్నారేమో? ఆయన కులాల పేరుతో తెరాస అధిష్టానాన్ని ఉద్దేశ్యించి ఆ విమర్శలు చేసినట్లుగానే కనిపిస్తున్నాయి కనుక ఆయనకు చర్యలో, చివాట్లో తప్పకపోవచ్చు.