హైదరాబాద్‌ మెట్రో తాజా అప్‌డేట్స్

హైదరాబాద్‌ మెట్రో మెట్రో రైల్‌ ప్రయాణికుల సౌకర్యార్ధం ఎల్&టి సంస్థ తాజాగా ఆన్‌లైన్‌లో టికెట్స్ కొనుగోలు చేసే అవకాశం కల్పించబోతోంది. ఆన్‌లైన్‌లో టికెట్ కొనుగోలు చేసినట్లయితే మొబైల్ ఫోన్లకు క్యూర్‌ కోడ్ వస్తుంది. దానిని స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన స్కానింగ్ యంత్రాలతో స్కాన్ చేసి నేరుగా లోపలకు వెళ్లిపోవచ్చు.

నిత్యం ప్రయాణించేవారిలో సుమారు 40 శాతం మంది స్మార్ట్ కార్డులను వినియోగిస్తుండగా మిగిలినవారు స్టేషన్లలో కౌంటర్ల వద్ద టికెట్ కొనుగోలు చేసి ప్రయాణిస్తున్నారు. ఎందుకంటే బహుశః మిగిలినవారిలో చాలామంది రోజూ మెట్రోలో ప్రయాణించే అవసరం ఉండక పోవచ్చు కనుక వారు స్మార్ట్ కార్డులు కూడా తీసుకొని ఉండకపోవచ్చు. స్మార్ట్ కార్డులు లేనందున వారు అత్యవసరంగా ప్రయాణించవలసి వచ్చినప్పుడు విధిగా కౌంటర్ల వద్ద క్యూలో నిలబడి టికెట్ కొనుక్కోక తప్పదు. ఆ ఇబ్బందిని కూడా తొలగించేందుకు ఎల్&టి సంస్థ ఈ ఆన్‌లైన్‌ టికెటింగ్ సౌకర్యంగా త్వరలోనే ప్రవేశపెట్టబోతోంది. ప్రయాణికులు మెట్రో స్టేషన్ చేరుకొనే ముందు మొబైల్ ఫోన్ ద్వారా ఆన్‌లైన్‌లో టికెట్ కొనుగోలు చేయడం పెద్ద కష్టమేమీ కాదు కనుక దీనికీ మంచి ప్రజాధారణ లభించవచ్చు.