కేటీఆర్‌, హరీష్‌రావులకు వార్నింగ్

సంగారెడ్డి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మంత్రులు కేటీఆర్‌, హరీష్‌రావులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. సంగారెడ్డి పట్టణానికి గోదావరి నీళ్ళు విడుదల చేయకపోతే వారిరువురూ పట్టణంలో కాలుపెట్టనీయనని వస్తుందని హెచ్చరించారు. 

 “ప్రజలు తెరాసకు ఓట్లు వేసి ఆదరిస్తున్నందునే వారికి ప్రజలంటే ఖాతరు లేకుండా పోయింది. ఎన్నికలప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు వచ్చి సంగారెడ్డి పట్టణ ప్రజల దాహార్తి తీర్చేందుకు గోదావరి జలాలు రప్పిస్తామని చెపుతారు. ఆ తరువాత పత్తా లేకుండా పోతారు. ప్రజలు తమను నిలదీయరనే నమ్మకమో...అహంభావమో తెలియదు కానీ ఇచ్చిన హామీలను సులువుగా మరిచిపోతుంటారు. సంగారెడ్డి ప్రజల తరపున నేను ప్రభుత్వంతో పోరాడేందుకు సిద్దంగా ఉన్నాను. నేటి నుంచి 10 రోజులలోగా సంగారెడ్డి పట్టణానికి గోదావరి నీటిని విడుదల చేస్తున్నట్లు వారు ప్రకటించకపోతే జనవరి 2నుంచి నిరవధికంగా జల పోరాటం చేస్తానను. మంత్రి హరీష్‌రావు సింగూర్ జలాలను ఇతర జిల్లాలకు తరలించుకుపోతుంటే ఎంపీ ప్రభాకర్ రెడ్డి అడ్డుకోలేదు. కనీసం ఇప్పటికైనా హరీష్‌రావు ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకొని సంగారెడ్డి పట్టణానికి నీళ్ళు అందించాలని డిమాండ్ చేస్తున్నాను. నీళ్ళు ఇస్తే నేనే ఆయనను ఘనంగా సన్మానిస్తాను లేకుంటే పట్టణంలో అడుగుపెట్టకుండా అడ్డుకొంటాను,” అని జగ్గారెడ్డి హెచ్చరించారు.