
పౌరసత్వ సవరణ చట్టంకు పార్లమెంటులో తెరాస మద్దతు ఇవ్వకపోవడంపై రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కె.లక్ష్మణ్ స్పందిస్తూ, “తెరాస పాకిస్తాన్ పార్టీ. అందుకే ఆ బిల్లుకు మద్దతు ఇవ్వలేదు,” అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఆయన వ్యాఖ్యలపై తెరాస కూడా ఘాటుగా స్పందించింది. తెరాస ఫైర్ బ్రాండ్ లీడర్ కర్నె ప్రభాకర్ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ, “దేశానికి, ప్రజలకు మేలు చేస్తుందనుకొన్న ప్రతీ బిల్లుకు మా పార్టీ మద్దతు ఇచ్చింది. కానీ దేశప్రజలను ఒక్కటిగా చూడలేని ఈ కాబ్ బిల్లుకు మద్దతు ఇవ్వలేదు. బిజెపిది మతతత్వమైతే, సిఎం కేసీఆర్‌ది మానవత్వం. బిజెపి ప్రజల మద్య చిచ్చుపెట్టి రాజకీయాలు చేయడం అలవాటు. సిఎం కేసీఆర్‌కు ప్రజలందరినీ కలుపుకుపోతుంటారు. కాబ్ బిల్లులో కొన్ని అంశాలనే మా పార్టీ వ్యతిరేకించింది. ఒకవేళ కేంద్రప్రభుత్వం వాటిని సవరించి ఉంటే దానికి మద్దతు ఇచ్చి ఉండేవాళ్లం. కాబ్ బిల్లు వలన దేశం అగ్నిగుండంగా మారింది. కానీ ఇదేమీ తెలియనట్లు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కె.లక్ష్మణ్ మతిస్థిమితం కోల్పోయినట్లు నోటికివచ్చినట్లు తప్పుడు కూతలు కూస్తున్నారు. మాది పాకిస్థాన్ పార్టీ అయితే మరి మీ పార్టీ ఏమిటి? ప్రజల మద్య చిచ్చుపెట్టే పార్టీయే కదా? గుజరాత్లో జరిగిన మతఘర్షణలకు మీ పార్టీయే కారణం కదా?ప్రధాని నరేంద్రమోడీ పాకిస్థాన్ వెళ్ళి అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్ ను ఎందుకు కలిసి వచ్చారు? మాపార్టీ ఎప్పుడూ లౌకికవాదానికి కట్టుబడి ఉంటుంది. కానీ కేంద్రప్రభుత్వం రాష్ట్రాలకు నిధులు విడుదల చేయకుండా రాష్ట్రాలపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తుంటుంది. మీ విధానాలతో ఇప్పటికే ప్రజలకు దూరమయ్యారని గుర్తించకుండా మత రాజకీయాలు చేస్తుంటే మీకే నష్టం అని గ్రహిస్తే మంచిది,” అని ఘాటుగా విమర్శించారు.