ఏపీకి అమరావతి, కర్నూలు, విశాఖలో మూడు రాజధానులు ఏర్పాటుచేయాలనుకొంటున్నట్లు ఏపీ సిఎం జగన్మోహన్రెడ్డి శాసనసభలో చేసిన ప్రకటనపై ఏపీలో పెద్ద దుమారమే మొదలైంది. రాయలసీమ, ఉత్తరాంద్రవాసులు దానిని స్వాగతిస్తుండగా, అమరావతి నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులు, కృష్ణ, గుంటూరు జిల్లావాసులు ఈ ప్రతిపాదనపై నిరసనలు వ్యక్తం చేస్తూ ఆందోళనబాట పట్టారు. దీనిపై ఏపీలో వైసీపీ, టిడిపి, బిజెపి, జనసేన నేతలమద్య తీవ్రస్థాయిలో వాగ్వాదాలు కూడా జరుగుతున్నాయి.
జగన్ ప్రతిపాదనపై తెలంగాణ రాజకీయ వర్గాలలో కూడా చర్చ మొదలైంది. ఆదిలాబాద్ బిజెపి ఎంపీ సోయం బాబూరావు చాలా భిన్నంగా స్పందించారు. తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన ఆదిలాబాద్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయడం లేదని, కనుక ఇకపై ఏడాదిలో రెండుసార్లు ఆదిలాబాద్‌లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. తద్వారా జిల్లా అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారిస్తుందని అన్నారు. ఈ ప్రతిపాదనను తాను ఆషామాషీగా చేయడంలేదని ప్రభుత్వం స్పందించకపోతే గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసి విజ్ఞప్తి చేస్తానని చెప్పారు.