సుదర్శనయాగం అందుకేనట!

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ సిఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. మంగళవారం సూర్యాపేటలో బిజెపి కార్యకర్తలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “సిఎం కేసీఆర్‌ తన కొడుకు కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేయడానికే మహా సుదర్శనయాగం చేస్తున్నారు తప్ప రాష్ట్రం.. ప్రజల కోసం కాదు. తెరాసలో తనకు తిరుగులేదని సిఎం కేసీఆర్‌ భావిస్తుంటే, కారు స్టీరింగ్ తమ చేతిలో ఉందంటూ మజ్లీస్ నేతలు అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీలు చెప్పుకొంటున్నారు. కానీ సిఎం కేసీఆర్‌తో సహా తెరాస నేతలెవరూ వారి మాటలను ఖండించే సాహసం చేయలేకపోతున్నారు. అంటే అర్ధం ఏమిటి?

ప్రధాని నరేంద్రమోడీ బ్రహ్మాస్త్రంలాంటివారు ఆయన ముందు బాహుబలినాని అనుకొంటున్న కేసీఆర్‌ నిలువలేరు. ప్రధాని నరేంద్రమోడీ చాలా సాహసోపేతంగా నిర్ణయాలు తీసుకొని  అమలుచేస్తుండటంతో దేశవ్యాప్తంగా మోడీ గ్రాఫ్ పెరిగిపోతోంది. మరోపక్క రాష్ట్రంలో అస్తవ్యస్తపాలన చేస్తున్న కారణంగా కేసీఆర్‌ గ్రాఫ్ నానాటికీ పడిపోతోంది. తెరాసలో ఉద్యమ తెలంగాణ, బంగారి తెలంగాణ నేతల మద్య విభేధాలు తారాస్థాయికి చేరుకొన్నాయి. ఏ క్షణంలోనైనా అవి బయటపడవచ్చు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దాదాపు కనుమరుగైపోయింది. కనుక తెరాసకు ఏకైక ప్రత్యామ్నాయం బిజెపి మాత్రమే. వచ్చే ఎన్నికలలో తెరాసను ఓడించి రాష్ట్రంలో తప్పకుండా అధికారంలోకి వస్తాం,” అని అన్నారు.