
నిర్భయ దోషులకు నేడో రేపో ఉరిశిక్ష అమలు చేసేందుకు తీహార్ జైలు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి సుప్రీంకోర్టు ఆదేశాల కోసం ఎదురుచూస్తుంటే ఈరోజు మరో అనూహ్య పరిణామం జరిగింది. ఉరిశిక్ష పడిన నలుగురు దోషులలో ఒకడైన అక్షయ్ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేశాడు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలో ధర్మాసనం దానిని విచారణకు స్వీకరించింది. అయితే జస్టిస్ ఎస్ఏ బాబ్డే కోడలు గతంలో నిర్భయ కేసు వాదించినందున ఈ కేసు విచారణలో తాను ఉండటం సరికాదని భావిస్తూ జస్టిస్ ఎస్ఏ బాబ్డే తప్పుకొన్నారు. దాంతో ఈకేసుపై ఇవాళ జరుగవలసిన విచారణ రేపటికి వాయిదా పడింది. జస్టిస్ ఎస్ఏ బాబ్డే స్థానంలో మరో న్యాయమూర్తిని ధర్మాసనంలోకి తీసుకొని బుదవారం ఈ కేసును విచారించి తుది తీర్పు చెప్పే అవకాశం ఉందని భావిస్తున్నారు. దోషులకు తక్షణమే మరణశిక్ష అమలుచేసేందుకు వీలుగా డెత్ వారెంట్ జారీ చేయాలని కోరుతూ నిర్భయ తల్లితండ్రులు దాఖలు చేసిన పిటిషన్‌పై డిల్లీ హైకోర్టు రేపు విచారణ చేపట్టనుంది. కనుక ఒకటి రెండురోజులలోనే నిర్భయ దోషులకు తీహార్ జైల్లో ఉరిశిక్ష అమలుచేసే అవకాశం ఉంది.