వేములవాడ తెరాస ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయన తప్పుడు సమాచారం సమర్పించి భారత పౌరసత్వం పొందినందున భారత పౌరసత్వానికి అనర్హుడని కనుక రద్దు చేస్తున్నట్లు కేంద్రహోంశాఖ చెప్పింది. దాంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఆ కేసుపై నేడు హైకోర్టు విచారణ చేపట్టింది.
చెన్నమనేని రమేష్‌కు భారత్, జర్మనీల ద్వందపౌరసత్వం ఉందని కేంద్రప్రభుత్వం తరపు న్యాయవాది వాదించగా, రమేష్ తన జర్మనీ పౌరసత్వాన్ని ఎప్పుడో రద్దు చేసుకొన్నారని ఆయన తరపున న్యాయవాది వాదించారు. దాంతో ఆయనకు ద్వందపౌరసత్వం ఉండనేందుకు తగిన సాక్ష్యాధారాలు సమర్పించవలసిందిగా కేంద్రప్రభుత్వం తరపు న్యాయవాదిని హైకోర్టు కోరింది. ఈ కేసును నాలుగు వారాలకు వాయిదా వేస్తూ, చెన్నమనేని భారత పౌరసత్వం రద్దుపై 8వారాలు స్టే విధించింది.
చెన్నమనేని రమేష్ 1993లో జర్మనీకి వలస వెళ్ళి ఆ దేశపౌరసత్వం పొందారు. సుమారు 16 ఏళ్ళపాటు అక్కడ ఒక యూనివర్సిటీలో ప్రొఫెసరుగా పనిచేసిన తరువాత 2009లో భారత్ తిరిగి వచ్చారు. మళ్ళీ అప్పుడు భారత్ పౌరసత్వం స్వీకరించారు. అయితే భారత్ పౌరసత్వం పొందేందుకు దేశంలో విధిగా 365 రోజులు ఉండాలనే నిబందన ఉంది. కానీ ఆయన దరఖాస్తు చేసుకొనే సమయానికి 96 రోజులు మాత్రమే ఉన్నారని ఎన్నికలలో పోటీ చేయాలంటే భారత్ పౌరసత్వం చాలా అవసరం కనుక ఆ విషయం దాచిపెట్టి పౌరసత్వం పొందారని ఆది శ్రీనివాస్ ఆరోపించారు. 2009, ఫిబ్రవరి 23న ఆయనకు భారత్ పౌరసత్వం లభించింది.
ఆ తరువాత 2009 అసెంబ్లీ ఎన్నికలలో వేములవాడ నుంచి టిడిపి అభ్యర్ధిగా పోటీ చేసి గెలిచారు. మళ్ళీ 2010లో జరిగిన ఉపఎన్నికలలో, 2014 అసెంబ్లీ ఎన్నికలలో తెరాస అభ్యర్ధిగా పోటీ చేసి గెలిచారు. అయితే ఎన్నికల అఫిడవిట్లో తనకు ద్వందపౌరసత్వం ఉందనే విషయం దాచిపెట్టారు. ఆయనపై పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ 2014లోనే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో ఈ వివాదం మొదలైంది. దానిపై సుదీర్గంగా న్యాయపోరాటం చేస్తూనే రమేష్ మళ్ళీ 2018లో మరోసారి వేములవాడ నుంచి ఎన్నికయ్యారు. ఈ కేసును విచారిస్తున్న హైకోర్టు ఆదేశాల మేరకు కేంద్రహోంశాఖ ఆయన ద్వందపౌరసత్వంపై లోతుగా విచారణ జరిపి ఆయన భారతీయ పౌరసత్వం కలిగి ఉండేందుకు అనర్హుడని హైకోర్టుకు తెలియజేసింది.