చిదంబరానికి బెయిల్‌ మంజూరు

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్ట్ అయిన మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరానికి ఎట్టకేలకు బుదవారం బెయిల్‌ మంజూరు అయింది. ఆయన బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ హృషీకేశ్ రాయ్, జస్టిస్ ఆర్‌. భానుమతి, జస్టిస్ ఏఎస్ బోపన్నలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం చిదంబరానికి షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది.  

ఐఎన్ఎక్స్ మీడియా కేసుకు సంబందించి మీడియాతో కానీ ఎవరితో గానీ మాట్లాడరాదని, సాక్షులను ప్రభావితం చేసేవిధంగా మాట్లాడరాదని సుప్రీంకోర్టు ఆంక్షలు విధించింది. సుప్రీంకోర్టు అనుమతి లేనిదే దేశం విడిచి వెళ్ళరాదని, పాస్ పోర్టును కోర్టుకు స్వాధీనం చేయాలని ఆదేశించింది. ఈ షరతులను ఉల్లంఘించినట్లు భావిస్తే బెయిల్‌ రద్దు చేస్తామని హెచ్చరించింది.

ఈ కేసుపై దర్యాప్తు జరుపుతున్న సిబిఐ గత ఏడాది ఆగస్ట్ 21న చిదంబరాన్నిఅరెస్ట్ చేసింది. రెండు నెలలు జైలులో గడిపిన తరువాత సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో విడుదలయ్యారు. కానీ మనీలాండరింగ్ కేసులో అక్టోబర్ 16న ఈడీ అరెస్ట్ చేయడంతో మళ్ళీ వెంటనే జైలుకు వెళ్ళవలసి వచ్చింది.. యూపీఏ హయాంలో ఆర్ధికమంత్రిగా దేశాన్ని... దేశ ఆర్ధికవ్యవస్థను శాశించిన చిదంబరం 105 రోజులు తీహార్ జైలులో గడుపవలసి వస్తుందని ఎవరూ ఊహించి ఉండరు.

సుప్రీంకోర్టు నుంచి జైలు అధికారులకు ఉత్తర్వుల కాపీ అందిన తరువాత బెయిల్‌కు సంబందించి లాంఛనాలు అన్నీ పూర్తయితే ఈరోజు సాయంత్రంలోగా జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడే ఆయన జైలు నుంచి విడుదలైనందున త్వరలోనే ఆయన కూడా పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యి మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపించవచ్చు. ముఖ్యంగా మోడీ ప్రభుత్వ ఆర్ధిక విధానాలపై తీవ్ర విమర్శలు గుప్పించవచ్చు.