
కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సిఎం కేసీఆర్‌కు చురకలు వేశారు. “ఆర్టీసీ సమస్యను 55 రోజులపాటు సాగదీసి చివరికి వారు కోరుకొన్నట్లుగానే వరాలు ఇచ్చి ముగించిన సిఎం కేసీఆర్, ఆర్టీసీ ఛార్జీలు పెంచి మరో కొత్త సమస్యను సృష్టించారు. ఒక సమస్యను పరిష్కరించడం అంటే మరొకటి సృష్టించడం కాదు కదా? ఆర్టీసీ సమ్మెను ముగింపజేసి 50,000 మంది ఆర్టీసీ కార్మికులకు ఊరట కల్పించారు. కానీ ఆర్టీసీ ఛార్జీలు పెంచి రాష్ట్ర ప్రజలందరిపై భారం మోపారు! ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నారు. మరి తెలంగాణలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి ఏమిటి కష్టం? రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాము. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం రూ.2 లక్షలు అప్పు చేశారు. అంత భారీ పెట్టుబడి పెట్టినందుకు దాని వలన రాష్ట్రానికి అంతకు అంతా ప్రయోజనం కలుగుతోందా?అది రాష్ట్రానికి ఉపయోగపడుతోందో లేదో కానీ ఏటా దానిపై రూ.11,000 కోట్లు వడ్డీలు చెల్లించవలసి వస్తోంది. ఇంత భారం ప్రజలపై పడుతోంది. సిఎం కేసీఆర్ అనాలోచిత నిర్ణయాలకు ప్రజలు మూల్యం చెల్లించవలసిరావడం బాధాకరం,” అని జగ్గారెడ్డి అన్నారు.