సిఎం కేసీఆర్‌ డిల్లీకి పయనం

సిఎం కేసీఆర్‌ సోమవారం సాయంత్రం ఆకస్మికంగా డిల్లీ బయలుదేరివెళ్ళారు. ప్రధాని నరేంద్రమోడీని కలిసి ఆర్టీసీ సమ్మె తదనంతర పరిణామాల గురించి వివరించి, ఆ సమస్యను తాను ఏవిధంగా పరిష్కరించానో తెలియజేసి, కేంద్రానికి ఆర్టీసీలో 33 శాతం వాటా ఉన్నందున ఆ మేరకు ఆర్టీసీకి నిధులు మంజూరు చేయాలని కోరబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ కేసు’ దానిపై తమ ప్రభుత్వం తీసుకొన్న చర్యల గురించి కూడా ప్రధాని నరేంద్రమోడీకి వివరించనున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా మహిళలపై అత్యాచారాలను నిరోధించేందుకు సంబందిత చట్టాలలో చేయవలసిన కొన్ని సవరణలను కూడా సిఎం కేసీఆర్‌ ప్రధాని మోడీకి సూచించనున్నట్లు తెలుస్తోంది. 

కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా, హైదరాబాద్‌లో స్కైవేల నిర్మాణం కోసం రక్షణభూముల కేటాయింపు, మిషన్ భగీరధ, కాకతీయ, రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలకు నిధులు విడుదల, బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు వంటి రాష్ట్రానికి చెందిన పలు అంశాలపై ప్రధాని మోడీతో చర్చించనున్నట్లు సమాచారం. అయితే ప్రధాని మోడీ అపాయింట్మెంట్ ఇంకా ఖరారు కావలసి ఉంది. ఒకవేళ ఆలస్యం అయితే ఆలోగా కేంద్రమంత్రులను కలిసి వారితో రాష్ట్రానికి చెందిన అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. 

సిఎం కేసీఆర్‌తో మంత్రి జగదీష్ రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు రాజీవ్ శర్మ, రాజ్యసభ సభ్యుడు బి సంతోష్ కుమారు డిల్లీ వెళ్లారు. ఆర్టీసీ సమ్మె, దిశ కేసు రెండింటిపై జాతీయస్థాయిలో చర్చ జరిగింది కనుక వాటిపై ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రహోంమంత్రి అమిత్ షాలకు స్వయంగా వివరించడం చాలా అవసరమని భావించినందునే సిఎం కేసీఆర్‌ డిల్లీ వెళ్ళి ఉండవచ్చు.