డాక్టర్ ప్రియాంకా రెడ్డి హత్య, అత్యాచారం కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి షాద్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకురావడంతో ఈరోజు ఉదయం నుంచి వేలాదిమందిగా ప్రజలు అక్కడకు చేరుకొని వారిని బహిరంగంగా ఉరి తీయాలని, కాల్చి చంపాలని, చట్ట ప్రకారం శిక్షించాలని కోరుతూ ఆందోళనలు చేస్తున్నారు. దాంతో వారిని అదుపు చేయడానికి షాద్‌నగర్ పోలీస్‌స్టేషన్ వద్ద భారీగా పోలీసులను మోహరించవలసి వచ్చింది.
ప్రజలను సంయమనం పాటించి వెనక్కు తిరిగి వెళ్ళిపోవలసిందిగా పోలీసులు ఎంతగా విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ ఎవరూ వినే పరిస్థితిలో లేరు. పైగా పోలీస్‌స్టేషన్‌లోకి చొచ్చుకువెళ్ళి నిందితులను బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తుండటంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. లాఠీ ఛార్జిలో గాయపడిన వారిని పోలీసులే ఆసుపత్రికి తరలిస్తున్నారు. ప్రస్తుతం షాద్‌నగర్ పోలీస్‌స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉండటంతో పోలీసులు నిందితులను ఆసుపత్రికి తీసుకువెళ్ళి వైద్య పరీక్షలు చేయించలేక వైద్యులనే పోలీస్‌స్టేషన్‌కు రప్పించారు.
ప్రజలు వెనక్కు తగ్గితే తప్ప నిందితులను కోర్టులో హాజరుపరచలేని పరిస్థితులు నెలకొన్నాయి. కానీ ఆ ప్రాంతంలో క్షణక్షణానికి జనం పెరిగిపోతూనే ఉన్నారు. కనుక నిందితులను కోర్టులో హాజరుపరచడం కంటే పరిస్థితులు అదుపు తప్పకుండా చూడటమే కష్టంగా మారిందిప్పుడు.