ఆర్టీసీ కార్మికులతో సిఎం కేసీఆర్‌ ఆదివారం సమావేశం

సిఎం కేసీఆర్‌ ఆర్టీసీ కార్మికులతో ఆదివారం ప్రగతి భవన్‌లో సమావేశం కానున్నారు. ఒక్కో డిపో నుంచి ఐదుగురు చొప్పున అన్ని డిపోల నుంచి సుమారు 150 మంది ఆర్టీసీ కార్మికులతో సిఎం కేసీఆర్‌ సమావేశం కానున్నారు. వారు హైదరాబాద్‌ చేరుకొనేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయవలసిందిగా రవాణామంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులతో కలిసి ప్రగతి భవన్‌లో భోజనం చేస్తానని సిఎం కేసీఆర్‌ చెప్పినందున అందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లు భావించవచ్చు. 

మరోపక్క సమ్మెకు నాయకత్వం వహించిన సుమారు 30 మంది యూనియన్ నేతలపై చర్యలకు ఆర్టీసీ యాజమాన్యం ఉపక్రమించింది. ముందుగా వారందరికీ రిలీఫ్ డ్యూటీని రద్దు చేసింది. గతంలో వారు ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తిరిగేందుకు వీలుగా వారికి డ్యూటీల నుంచి మినహాయింపు పొందేవారు. ఇప్పుడు ఆ సౌకర్యం రద్దు చేయబడింది. కనుక ఇకపై వారు కూడా తప్పనిసరిగా 8 గంటలు డ్యూటీ చేయవలసి ఉంటుంది. అయితే వారిని కూడా తిరిగి ఉద్యోగాలలోకి తీసుకొంటున్నట్లు సూచించినట్లే భావించవచ్చు. ఆర్టీసీ గుర్తింపు యూనియన్ తెలంగాణ మజ్దూర్ యూనియన్ కార్యాలయానికి ఈరోజు మధ్యాహ్నం ఆర్టీసీ విజిలెన్స్ అధికారులు తాళాలు వేసి భవనాన్ని స్వాధీనం చేసుకొన్నారు.