ఆర్టీసీ కార్మికుల కళ్ళలో మళ్ళీ వెలుగులు

ఆర్టీసీ సమ్మె ఆర్టీసీ కార్మికులకు ఒక చేదు అనుభవంగా మిగిలింది. చివరకు సిఎం కేసీఆర్‌ వారినందరినీ నేటి నుంచి బేషరతుగా విధులలోకి తీసుకోవడానికి అంగీకరించడంతో ఇనాళ్ళుగా కళ తప్పిన వారి మొహాలలో మళ్ళీ సంతోషం కనిపిస్తోంది. కేసీఆర్‌ నిన్న ప్రకటన చేసినప్పటి నుంచి ఆర్టీసీ కార్మికులు ఒకరికొకరు మిటాయిలు తినిపించుకొంటూ, పోలీసులకు కూడా తినిపించి తమ సంతోషాన్ని పంచుకొన్నారు. కొన్ని డిపోల వద్ద కేసీఆర్‌ చిత్రపటాలకు పాలాభిషేకాలు కూడా చేస్తూ జై కేసీఆర్‌ అంటూ ఆర్టీసీ కార్మికులు నినాదాలు చేశారు.  



ఈరోజు తెల్లవారుజామునే ఆర్టీసీ కార్మికులు అందరూ యూనిఫారంలు ధరించి డిపోలవద్దకు చేరుకోగా డిపో మేనేజర్లు వారిని ఆప్యాయంగా పలకరిస్తూ విధులలోకి తీసుకొన్నారు. ముఖ్యంగా మహిళా కండక్టర్లు తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీళ్ళు పెట్టుకొన్నారు. ఆర్టీసీ కధ సుఖాంతం అవడంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల నుంచి బస్సులు రోడ్లపైకి వచ్చాయి. ఆర్టీసీ బస్సులలో ప్రయాణికులు కూడా డ్రైవర్, కండక్టర్లను ఆప్యాయంగా పలకరించి అభినందనలు తెలుపుతున్నారు.