
ఆర్టీసీ సమ్మెకు మద్దతు ప్రకటించిన బిజెపి ఈ సమస్యను కేంద్రం దృష్టికి కూడా తీసుకువెళ్లింది. కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ ఈ సమస్య గురించి సిఎం కేసీఆర్‌తో మాట్లాడుతారని, వారం రోజులలోపుగా తెలంగాణ ఆర్టీసీ, రవాణా అధికారులను డిల్లీకి రప్పించి రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కె.లక్ష్మణ్ చెప్పారు. మళ్ళీ ఈరోజు కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి రాష్ట్రానికి ఐఐఎం, నవోదయ, కేంద్రీయ విద్యాలయాలు మంజూరు చేయాలని కోరారు. అలాగే ఎన్‌హెచ్ 44ను ఇండస్ట్రియల్ కారిడార్‌గా ప్రకటించాలని కోరారు.
అనంతరం డిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్రాభివృద్ధికి సంబందించిన అంశాలతో పాటు రాష్ట్రంలో నెలకొన్న అవాంఛనీయ పరిస్థితుల గురించి కూడా ఆమెకు వివరించాను. కేసీఆర్ సర్కార్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు మూసివేసి మద్యం షాపులు, బార్లు తెరుస్తోంది. ప్రాధమిక స్థాయి నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు రాష్ట్రంలో విద్యావ్యవస్థను భ్రష్టు పట్టిస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు, కార్పొరేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నాలు చేస్తోంది. తద్వారా నిరుపేద విద్యార్ధులకు చదువుకొనే అవకాశం లేకుండా చేస్తోంది. ఆర్టీసీని నిర్వీర్యం చేసి ప్రైవేట్ పరం చేయాలని చూస్తోంది. ఉద్యోగాల భర్తీ విషయంలో తెరాస సర్కార్ హామీని నిలబెట్టుకోలేదు. రాష్ట్రంలో ప్రాధమిక హక్కులకు భంగం కలిగే పరిస్థితులు నెలకొని ఉన్నాయి. రాష్ట్రంలో నెలకొన్న ఈ పరిస్థితులన్నిటినీ మా అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లాము. సిఎం కేసీఆర్ ఆర్టీసీని ప్రైవేటీకరించడానికి సిద్దపడుతున్నట్లు విన్నాను. దానిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాము,” అని అన్నారు.