
బుదవారం మధ్యాహ్నం మలక్‌పేట్ మెయిన్ రోడ్డు పక్కనే ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి వచ్చిన మరో ఆర్టీసీ బస్సు డ్డీకొంది. అయితే అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. మంగళవారం ఉదయం బంజారా హిల్స్ రోడ్ నెంబర్: 12లో స్కూటీపై వెళుతున్న ఒక మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీరును వెనుక నుంచి వేగంగా దూసుకువచ్చిన ఆర్టీసీ బస్సు డ్డీకొనడంతో ఆమె బస్సు చక్రాల క్రింద నలిగి చనిపోయిన సంగతి తెలిసిందే. ఆమెకు నాలుగేళ్ళు వయసున్న ఇద్దరు కవలపిల్లలున్నారు. ఆమె చనిపోవడంతో తమ పిల్లలు తల్లిలేనివరయ్యారని ఆమె భర్త విలపించారు. తన భార్య చావుకు డ్రైవర్, ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యంలో ఎవరు బాధ్యత వహిస్తారనే ప్రశ్నకు సమాధానం చెప్పేవారే లేరు.
సిద్ధిపేటలో జరిగిన ఇటువంటి ప్రమాదంలో ప్రముఖ నటుడు సంపూర్ణేష్ బాబు, కుటుంబ సభ్యులు తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. వారు ప్రయాణిస్తున్న కారును ఆర్టీసీ బస్సు డ్డీకొంది. ఆ ప్రమాదంలో వారికి స్వల్పంగా గాయాలయ్యాయి. వారి కూడా దెబ్బతింది. సంపూర్ణేష్ బాబు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఈ ప్రమాదం గురించి ఫిర్యాదు చేశారు. పోలీసులు డ్రైవరుపై కేసు నమోదు చేసి అదుపులో తీసుకొన్నారు.
రద్దీగా ఉండే రోడ్లలో బస్సులను నడపాలంటే చాలా అనుభవం ఉండాలి. బస్సును అదుపు చేయడం తెలిసి ఉండాలి. కానీ తాత్కాలిక డ్రైవర్లకు అటువంటి అనుభవం, నేర్పు రెండూ లేకపోవడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. రోడ్లపై బాగా రద్దీగా ఉన్నప్పుడు అనుభవం లేని డ్రైవర్లు బస్సును అదుపుచేసే ప్రయత్నంలో కాలివద్ద ఉండే బ్రేకుకు బదులు యాక్సిలేటర్ పెడల్ నొక్కినప్పుడు బస్సు మరింత వేగంగా దూసుకుపోయి ఎదురుగా ఉన్న వాహనాలను డ్డీ కొంటుండవచ్చునని ఆర్టీసీ డ్రైవర్లు అభిప్రాయపడుతున్నారు. అనుభవం లేని తాత్కాలిక డ్రైవర్లతో నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నా వారితోనే ఆర్టీసీ బస్సులు నడిపిస్తూ ఆర్టీసీ యాజమాన్యం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.