సెప్టెంబర్ నెల జీతాలు చెల్లించనవసరం లేదట!

గత రెండు నెలలుగా జీతాలు లేక ఆర్ధిక సమస్యలతో క్రుంగిపోయి అలమటిస్తున్న ఆర్టీసీ కార్మికులకు తెరాస సర్కార్‌ మరో షాక్ ఇచ్చింది. సెప్టెంబర్ నెల జీతం బకాయిలు చెల్లించడానికి ఆర్టీసీ యాజమాన్యం వద్ద డబ్బు లేదని ఇంతకాలం వాదిస్తున్న ప్రభుత్వ న్యాయవాది, ఇప్పుడు నిబందనల ప్రకారం ఆర్టీసీ కార్మికులకు సెప్టెంబర్ నెల జీతాలు చెల్లించవలసిన అవసరమే లేదని వాదిస్తున్నారు. 

సెప్టెంబర్ నెల జీతాల చెల్లింపుపై నేడు హైకోర్టులో విచారణ జరుగుతోంది. ప్రభుత్వం తరపున వాదిస్తున్న న్యాయవాది, ‘పేమెంట్ ఆఫ్ పెజస్ యాక్ట్ 7’ ప్రకారం, సరైన కారణం లేకుండా కార్మికులు ఒకరోజు విధులకు హాజరుకాకపోతే 8 రోజుల జీతం కోసుకోవచ్చునని వాదించారు. ఆ లెక్కన 52 రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు ఆర్టీసీ యాజమాన్యం నయాపైసా చెల్లించవలసిన అవసరం లేదని వాదిస్తున్నారు. 

ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం తిరిగి విధులలో తీసుకొంటుందా లేదా? అనే విషయాన్ని పక్కన బెడితే వారు పనిచేసిన రోజులకు జీతం చెల్లిస్తే చాలా గౌరవంగా ఉండేది. కానీ నిబందనల పేరు చెప్పి ఆర్టీసీ కార్మికులకు జీతాలు చెల్లించకుండా తప్పించుకోవాలని ప్రయత్నించడం చాలా దారుణమే. ఒకవేళ ఆర్టీసీ యాజమాన్యం (ప్రభుత్వం) నిబందనలను తూచా తప్పకుండా పాటించదలచుకుంటే, ఆర్టీసీ కార్మికులు పీఎఫ్ లో పొదుపు చేసుకొన్న రూ.760 కోట్లు, కోపరేటివ్ సొసైటీలో దాచుకొన్న సుమారు రూ.530 కోట్లు వాడేసుకొన్నందుకు ఆర్టీసీ యాజమాన్యం కూడా వడ్డీతో సహా జరిమానా చెల్లించవలసి ఉంటుంది. 

ఏది ఏమైనప్పటికీ, తెలంగాణ సాధన కోసం పోరాడిన ఆర్టీసీ కార్మికుల పట్ల ప్రభుత్వం ఇంత నిర్దయగా వ్యవహరిస్తుండటం చాలా బాధాకరమే.