ఆర్టీసీ సమ్మె మొదలైనప్పుడు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ వ్రాసున్న బ్యానర్లు, ప్లకార్డులు పట్టుకొని ఆర్టీసీ కార్మికులు రోడ్లపై ఆందోళన కార్యక్రమాలు నిర్వహించేవారు. సమ్మె విరమించినప్పటికీ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను విధులలోకి తీసుకోవడానికి నిరాకరిస్తుండటంతో ఇప్పుడు ‘ఆర్టీసీ కార్మికులను వెంటనే విధులలోకి తీసుకోవాలి,’ అని వ్రాసున్న బ్యానర్లు, ప్లకార్డులతో ఆందోళన కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. చేతిలో డబ్బు లేకపోయినా ఆర్టీసీ కార్మికులు 52 రోజులపాటు ఏకధాటిగా సమ్మె చేశారు. కానీ ఇక ఎంతమాత్రం సమ్మెను కొనసాగించే పరిస్థితిలో లేరు. తమ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తమను తక్షణం విధులలోకి తీసుకోవాలని ఆర్టీసీ కార్మికులు కన్నీళ్ళతో డిపో మేనేజర్లను వేడుకొంటున్నారు. కానీ ప్రభుత్వం అనుమతి లేకుండా చేర్చుకోలేమని చెపుతున్నారు. చాలా చోట్ల ఆర్టీసీ కార్మికులు డిపోల సమీపానికి చేరనీయకుండా పోలీసులు అడ్డుకొని పోలీస్‌స్టేషన్లకు తరలిస్తున్నారు. ఖమ్మంలో ముందస్తు జాగ్రత్త చర్యగా పోలీసులు ఆర్టీసీ కార్మికుల ఇళ్ళలో ప్రవేశించి అదుపులో తీసుకొని పోలీస్‌స్టేషన్లకు తరలించారు. ఇంట్లో వంట చేసుకొంటున్న తనను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని మహిళా కండక్టర్ ప్రశ్నకు పోలీసులు సమాధానం చెప్పలేదు. ఇంట్లోకి పోలీసులు జొరబడి తల్లిని పట్టుకుపోతుంటే ఆమె పిల్లలు భయంతో ఏడుస్తుంటే అది చూసి ఇరుగుపొరుగులు చలించిపోయారు.
ఆర్టీసీలో 5,100 రూట్లను ప్రైవేటీకరించడం దాదాపు ఖాయం అయినట్లే కనిపిస్తోంది. రేపు జరుగబోయే మంత్రివర్గ సమావేశంలో దీనికి ఆమోదముద్ర పడగానే రవాణాశాఖ తదుపరి చర్యలు చేపట్టవచ్చు. కనుక ఆర్టీసీ కార్మికుల భవిష్యత్ అగమ్యగోచరంగానే కనిపిస్తోంది.