
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్ రెడ్డి డిల్లీలో కేంద్రమంత్రి నితిన్ గడ్కారీని కలిసి ఆర్టీసీ సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవలసిందిగా విజ్ఞప్తి చేశారు. వారు మొదట ప్రధాని నరేంద్రమోడీని కలిసేందుకు ప్రయత్నించారు కానీ వీలుపడకపోవడంతో ప్రధాని కార్యదర్శికి వినతిపత్రం ఇచ్చి వచ్చారు. అనంతరం కేంద్రమంత్రి నితిన్ గడ్కారీని కలిసి ఆర్టీసీ సమ్మె, సిఎం కేసీఆర్ మొండివైఖరి, ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు, మరణాలు, జీతాలు అందకపోవడంతో ఆర్టీసీ కార్మికుల దుస్థితి, ఆర్టీసీ ప్రైవేటీకరించడానికి తెరాస సర్కార్ చేస్తున్న సన్నహాల గురించి ఆయనకు వివరించారు. కనుక కేంద్రప్రభుత్వం తక్షణం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకొని 50,000 మంది ఆర్టీసీ కార్మికులు వారి కుటుంబాలు రోడ్డున పడకుండా కాపాడాలని విజ్ఞప్తి చేశారు. దానికి సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ ఒకటి రెండు రోజులలోనే రాష్ట్ర రవాణా శాఖ అధికారులు, ఆర్టీసీ అధికారులతో డిల్లీలో సమావేశమయ్యి ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “తెరాస అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఉద్యోగాలు ఇవ్వకపోగా ఒకేసారి 50,000 ఆర్టీసీ కార్మికులను రోడ్డున పడేశారు. ఆర్టీసీ ప్రైవేటీకరణ చేసి విలువైన ఆర్టీసీ ఆస్తులను అమ్ముకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఆర్టీసీని ప్రైవేటీకరిస్తే ఆర్టీసీ కార్మికులే కాకుండా సామాన్య ప్రజలు కూడా తీవ్రంగా నష్టపోతారు. కనుక ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఒకవేళ తెరాస సర్కార్ ఇప్పుడు ఆర్టీసీని ప్రైవేటీకరించినప్పటికీ భవిష్యత్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే దానిని రద్దు చేసి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాము,” అని అన్నారు.