
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తరువాత ఏర్పడిన రాజకీయ సంక్షోభం సుప్రీంకోర్టు జోక్యంతో ముగిసినట్లే కనిపిస్తోంది. శాసనసభలో బలనిరూపణ చేసుకోలేమని గ్రహించిన ఫడ్నవీస్, అజిత్ పవార్ మంగళవారం ఉదయం తమ పదవులకు రాజీనామాలు చేశారు. దాంతో శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అయ్యింది. గురువారం సాయంత్రం ముంబై, దాదార్లోని శివాజీ పార్క్లో సాయంత్రం 6.40 గంటలకు ఉద్ధవ్ థాక్రే మహా సిఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ఎన్సీపీ శాసనసభాపక్ష నేత జయంత్ పాటిల్ ప్రకటించారు.
ముఖ్యమంత్రి పదవి కోసం పట్టుబట్టి బిజెపితో తెగతెంపులు చేసుకొన్న శివసేన చివరికి తన కోరిక నెరవేర్చుకోగలిగింది. ఇందుకు బదులుగా కాంగ్రెస్, ఎన్సీపీలకు ఉప ముఖ్యమంత్రి పదవులు, కీలకమైన మంత్రిపదవులు ఇచ్చేందుకు మూడు పార్టీలు ఒప్పందం చేసుకొన్నాయి. ఇక 1966లో బాల్ థాక్రే శివసేన పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు థాక్రే కుటుంబంలో ఎవరూ ముఖ్యమంత్రి పదవి చేపట్టలేదు. మొట్టమొదటిసారిగా ఉద్ధవ్ థాక్రే ముఖ్యమంత్రి పదవి చేపట్టనున్నారు. కనుక శివసేనలో శ్రేణులు ఆనందోత్సాహలతో సంబురాలు చేసుకొంటున్నాయి.