
ఆర్టీసీ కార్మిక సంఘాలు బేషరతుగా సమ్మె విరమించి నేటి నుంచి విధుల చేరాలని నిశ్చయించడంతో ఈరోజు తెల్లవారుజామున 5 గంటల నుంచే ఆర్టీసీ కార్మికులు డిపోలవద్దకు చేరుకొన్నారు. అయితే ఆర్టీసీ కార్మికులను విధులలోకి తీసుకోకూడదని ప్రభుత్వం నిర్ణయించడంతో రాష్ట్రంలో అన్ని డిపోల వద్ద భారీగా పోలీసులను మోహరించి విధులకు హాజరయ్యేందుకు వస్తున్న ఆర్టీసీ కార్మికులను అదుపులోకి తీసుకొని పోలీస్స్టేషన్లకు తరలిస్తున్నారు. దాంతో డిపోల వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది.
ఆర్టీసీ జేఏసీ మళ్ళీ నిన్న సమ్మె విరమణ ప్రకటన చేయడంతో టీఎస్ఆర్టీసీ ఇన్-ఛార్జ్ ఎండీ సునీల్ శర్మ, ఉన్నతాధికారులతో సిఎం కేసీఆర్ ప్రగతి భవన్లో సమావేశమయ్యి చర్చించారు. అనంతరం సునీల్ శర్మ ఒక ప్రకటన విడుదల చేశారు.
“ఎప్పుడు కావాలనుకొంటే అప్పుడు సమ్మె చేసి వారికి ఇష్టం వచ్చినప్పుడు విధులలో చేరడానికి వస్తామంటే ఏ సంస్థ అంగీకరించదు. ఆర్టీసీ కార్మికులు వారి యూనియన్ లీడర్ల మాయమాటలు నమ్మి చట్ట విరుద్ధంగాన సమ్మెలో పాల్గొన్నారు. కనుక ఆర్టీసీ కార్మికులు ఇప్పుడు వచ్చి చేరుతామంటే విధులలో తీసుకోలేము. తాత్కాలిక డ్రైవర్లను, కండక్టర్లను అడ్డుకొనేందుకు ఎవరు ప్రయత్నించినా వారిపై పోలీసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకొంటారు. ప్రస్తుతం ఆర్టీసీ కేసు లేబర్ కోర్టులో ఉంది. అక్కడ తీర్పు వచ్చేవరకు ఆర్టీసీ కార్మికులు వేచి ఉండాలి,” అని ఆ ప్రకటన సారాంశం.