కాంగ్రెస్‌, బిజెపిలు దొందూ దొందే: తెరాస

తెలంగాణ ప్లానింగ్ కమీషన్ వైస్-ఛైర్మన్, తెరాస సీనియర్ నేత బి. వినోద్ కుమార్ కేంద్రప్రభుత్వ వైఖరిని తప్పు పడుతూ తీవ్ర విమర్శలు చేశారు. “ఆనాడు కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్‌ వ్యవస్థలను దురుపయోగం చేసిందని ఆనాడు ప్రతిపక్షంలో  ఉన్న బిజెపి ఆరోపించేది. ఇప్పుడు బిజెపి కూడా అదే చేస్తోంది. మహారాష్ట్రలో అధికారం దక్కించుకోవడం కోసం గవర్నర్‌ను అడ్డుపెట్టుకొని తన ప్రత్యర్ధులతో గేమ్ ఆడుతోంది. బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేయలేనప్పుడు, దాని తరువాత స్థానంలో నిలిచిన శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్దం అయితే, వాటికి ఆ అవకాశం దక్కనీయకుండా రాష్ట్రపతి పాలన విధించడం, మళ్ళీ అర్ధరాత్రి రాష్ట్రపతి పాలన ఎత్తివేసి దేవేంద్ర ఫడ్నవీస్ చేత శనివారం తెల్లవారుజామున హడావుడిగా గవర్నర్‌ ప్రమాణ స్వీకారం చేయించడం ద్వారా మోడీ ప్రభుత్వం గవర్నర్‌ వ్యవస్థను భ్రష్టు పట్టించేసింది. కనుక బిజెపి, కాంగ్రెస్ పార్టీలు రెంటిలో తేడా ఏమీ లేదు. అధికారం చేజిక్కించుకోవడం కోసం ఎంతకైనా దిగజారుతాయని అర్ధం అవుతోంది,” అని అన్నారు.