మహారాష్ట్రలో షాకింగ్ పొలికల్ ట్విస్ట్

మహారాష్ట్ర రాజకీయాలలో అనూహ్యమైన పరిణామం సంభవించింది. కాంగ్రెస్‌, ఎన్సీపీల మద్దతు లభించడంతో శివసేన అధినేత ఉద్దవ్ థాక్రే నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దం అవుతుంటే, ఈరోజు ఉదయం మాజీ ముఖ్యమంత్రి, బిజెపి శాసనసభా పక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్ చేత మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ ప్రమాణస్వీకారం చేయించారు. ఆయనతో పాటు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మేనల్లుడు అజిత్ పవార్ కూడా ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. 

ఇది శివసేనకు, దానికి మద్దతు ప్రకటించిన ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలకు కూడా పెద్ద షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే, శుక్రవారం రాత్రే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ శివసేన అధినేత ఉద్దవ్ థాక్రే నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే అప్పటికీ తమ ఎన్సీపీలోని కొంత మంది ఎమ్మెల్యేలు బిజెపికి మద్దతు ఇవ్వబోతున్నారనే విషయం శరద్ పవార్‌కు తెలియకపోవడమే విచిత్రం. 

ఎన్సీపీలో ఎంతమంది ఎమ్మెల్యేలు బిజెపివైపు వెళ్ళారో ఇంకా తెలియవలసి ఉంది కానీ రాష్ట్రంలో ఇక మనుగడ సాగించడం కష్టమని భావిస్తున్న తరుణంలో మళ్ళీ పుంజుకోవడమే కాక అధికారం కూడా చేపట్టబోతున్న సమయంలో ఎన్సీపీ నిలువునా చీలినట్లయింది. 

ఇక ముఖ్యమంత్రి పదవి దక్కించుకోవాలనే ఏకైక లక్ష్యంతో అనేక ఏళ్ళుగా కలిసి సాగుతున్న బిజెపికి కటీఫ్ చెప్పేసిన శివసేన కూడా ఈ దెబ్బతో షాక్ అయ్యింది. 

కాంగ్రెస్ పార్టీ ఓ మెట్టు దిగి తమ సిద్దాంతాలకు, ఆలోచనలకు పూర్తి భిన్నంగా ఉండే అతివాద మతతత్వ శివసేనతో చేతులు కలపడానికి సిద్దపడినప్పటికీ రాష్ట్రంలో మళ్ళీ బిజెపి పగ్గాలు చేపట్టడంతో కాంగ్రెస్ పరిస్థితి వ్రతం చెడినా ఫలం దక్కనట్లయింది.