తమిళనాడులో మల్టీస్టార్ పాలిటిక్స్

మల్టీస్టార్ సినిమాల గురించి అందరికీ తెలుసు..ఇప్పుడు మల్టీస్టార్ పాలిటిక్స్ కూడా చూసే భాగ్యం ప్రజలకు లభించబోతోంది. కొన్ని సినిమాలలో కలిసి నటించిన కోలీవుడ్ అగ్ర హీరోలు రజనీకాంత్, కమల్ హాసన్ రాజకీయాలలో కూడా కలిసి పనిచేయడానికి సిద్దమవుతున్నారు. 

వారిలో కమల్ హాసన్‌  ఏడాదిన్నర క్రితమే పార్టీ పెట్టి ప్రత్యక్షరాజకీయాలలోకి ప్రవేశించారు. ఆయన పార్టీ మొట్టమొదటిసారిగా ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేసింది గానీ ఒక సీటు కూడా గెలుచుకోలేకపోవడంతో తీవ్ర నిరాశ ఎదురైంది. 

ఇక రజనీకాంత్‌  ప్రత్యక్షరాజకీయాలలోకి వస్తానని చెప్పడమే తప్ప ధైర్యం చేయలేకపోతున్నారు. పైగా కమల్ హాసన్‌కు ఎదురైన చేదు అనుభవాన్ని చూసిన తరువాత ఆలోచనలో పడ్డారు. కానీ ఆయన రాజకీయ ప్రవేశంపై మీడియాలో వస్తున్న ఊహాగానాలు ఆయన వ్యక్తిగత ప్రతిష్టను మసకబారుస్తున్నాయి. కనుక రాజకీయ ప్రవేశం చేయక తప్పని పరిస్థితి ఎదురైంది. 

కానీ తమిళనాడులో దశాబ్ధాలుగా ఎదురులేకుండా సాగుతున్న అన్నాడిఎంకె, డిఎంకె పార్టీలను ఎదుర్కోవాలంటే కమల్ హాసన్‌, రజనీకాంత్‌ ఇద్దరూ చేతులు కలుపక తప్పదనే సంగతి అర్ధమయింది. లోక్ సభ ఎన్నికలలో ఎదురైన చేదు అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని కమల్ హాసన్‌ ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిషోర్‌ సాయం కోరారు. బహుశః ఆయన సూచన మేరకే ఇద్దరూ చేతులు కలిపేందుకు సిద్దపడినట్లు భావించవచ్చు.    

కనుక ‘ప్రజలకు మేలు కలుగుతుందటే కలిసి పనిచేయడానికి సిద్దం’ అని ఇద్దరూ వేర్వేరుగా ప్రకటనలు చేశారు. దాంతో తమిళనాడులోని వారి అభిమానులు సంతోషంతో పొంగిపోతున్నారు. ఇద్దరూ కలిసి పనిచేసేందుకు సిద్దపడ్డారు కనుక త్వరలోనే ఇరువర్గాల మద్య చర్చల ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉంది. ఇరువురి సిద్దాంతాలు, ఆశయాలకు అనుగుణంగా ప్రణాళికను రూపొందించుకొని,  పార్టీలో పదవుల పంపకాలు చేసుకోవలసి ఉంటుంది. ఒకవేళ వారిరువురూ కలిసి పనిచేయగలిగితే తమిళనాడు రాజకీయాలలో కొత్త శకం ప్రారంభం అయినట్లే భావించవచ్చు.