
ఆర్టీసీ సమ్మె తదితర అంశాలపై ఈరోజు హైకోర్టు విచారణలో ఇరుపక్షాల వాదనలు విన్న తరువాత ఈ కేసు తదుపరి విచారణను నవంబర్ 18కి వాయిదా వేసింది. ఈరోజు కూడా ఆర్టీసీ కార్మికుల సెప్టెంబర్ నెల జీతాల చెల్లింపు, సమ్మె ముగింపుకు ప్రయత్నాలు, ఆర్టీసీ ప్రయివేటీకరణ అంశాలపై హైకోర్టులో చర్చ జరుగలేదు. సమ్మె చట్టవిరుద్దామా కాదా? సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులపై ఎస్మా ప్రయోగించవచ్చా లేదా? అనే అంశాలపైనే ప్రధానంగా వాదోపవాదాలు సాగాయి.
ఈ 40 రోజులలో 27 మంది ఆర్టీసీ కార్మికులు చనిపోయారని కనుక హైకోర్టు తనకున్న విశేషాధికారాలతో హైపవర్ కమిటీని ఏర్పాటు చేసి సమస్య పరిష్కారానికి మార్గం సుగమం చేయాలని ఆర్టీసీ కార్మిక సంఘాల తరపున న్యాయవాది రాపోలు భాస్కర్ హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. కానీ ప్రభుత్వం అందుకు అంగీకరించక పోవడంతో హైకోర్టు కూడా ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదు. నవంబర్ 18వరకు ఆర్టీసీ ప్రయివేటీకరణపై స్టేను పొడిగిస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది.
రాష్ట్ర ప్రభుత్వం చర్చల విషయంలో మొండికేసినందున కనీసం హైకోర్టులో తమకు సానుకూలంగా నిర్ణయం వెలువడుతుందని ఇంతకాలంగా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఆర్టీసీ కార్మికులకు ఈ పరిణామాలు తీవ్ర నిరాశను కలిగిస్తాయని చెప్పవచ్చు. ఆర్టీసీ కార్మికుల దయనీయ పరిస్థితుల గురించి కేంద్రప్రభుత్వానికి తెలియవనుకోలేము. కనుక ఆర్టీసీలో 33 శాతం వాటా ఉన్న భాగస్వామిగా కేంద్రం జోక్యం చేసుకొని ఈ సమస్యను పరిష్కరిస్తే బాగుంటుంది.