అనర్హత వేటు సరైనదే...కానీ ఎన్నికలలో పోటీ చేయొచ్చు

అనర్హత వేటుపడిన 17 మంది కర్ణాటక ఎమ్మెల్యేల కేసులో సుప్రీంకోర్టు ఈరోజు సంచలన తీర్పు చెప్పింది. వారిపై అసెంబ్లీ స్పీకర్ రమేశ్ కుమార్ అనర్హత వేటు వేయడాన్ని సుప్రీంకోర్టు సమర్ధించింది. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల వరకు వారు పోటీ చేయకూడదని స్పీకర్ విధించిన నిషేదాన్ని కొట్టివేసింది. అనర్హత వేటు పడిన 17 మంది ఎమ్మెల్యేలు త్వరలో జరుగబోయే ఉపఎన్నికలలో పోటీ చేయవచ్చునని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 

అనర్హత వేటు పడినవారిలో కాంగ్రెస్-14, జెడిఎస్-3 మంది ఎమ్మెల్యేలున్నారు. వారి చేత రాజీనామాలు చేయించడం ద్వారా కాంగ్రెస్‌-జెడిఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలిపోయేలా చేసి బిజెపి అధికారం చేజిక్కించుకొన్న సంగతి తెలిసిందే. బిజెపికి అధికారం దక్కేందుకు సాయపడినందుకుగాను తమకు బిజెపి ప్రభుత్వంలో కీలకపదవులు లభిస్తాయని వారు ఆశపడితే, స్పీకర్ రమేశ్ కుమార్ అనర్హత వేటు వేయడంతో వారి పరిస్థితి కుడితిలో పడిన ఎలుకలా మారింది. 

వారిపై అనర్హతవేటు పడటంతో ఖాళీ అయిన స్థానాలకు ఉపఎన్నికలు జరుగనున్నాయి. వారి స్థానంలో కాంగ్రెస్‌, జెడిఎస్ పార్టీలు వేరే అభ్యర్ధులను నిలబెట్టాయి. 17మంది ఎమ్మెల్యేలు ఎన్నికలలో పోటీ చేయడానికి సుప్రీంకోర్టు అనుమతించడంతో కర్ణాటక రాజకీయాలలో మళ్ళీ అనూహ్య పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది.