మహబూబాబాద్‌లో ఉద్రిక్త పరిస్థితులు

మహబూబాబాద్‌ డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ నరేశ్ ఈరోజు తెల్లవారుజామున పురుగుల మందు త్రాగి ఆత్మహత్య చేసుకోవడంతో ఆర్టీసీ జేఏసీ నేతలు, కార్మికులు, ప్రతిపక్ష నేతలు ఆయన నివాసానికి చేరుకొన్నారు. అనంతరం వారు నరేశ్ మృతదేహంతో మహబూబాబాద్‌ డిపో వద్దకు ర్యాలీగా బయలుదేరారు. వారిని దారిలో పోలీసులు అడ్డగించి, అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించేందుకు ప్రయత్నిస్తుండటంతో ఆర్టీసీ కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. 

నరేశ్ సహచర ఆర్టీసీ కార్మికులు చెప్పిన దాని ప్రకారం, నరేశ్‌కు అనారోగ్యంతో బాధపడుతున్న భార్య పోలమ్మ, శ్రీకాంత్, సాయి కిరణ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె వైద్యానికి నెలకు రూ.5,000 వరకు ఖర్చు అవుతుంటుంది. ఇద్దరు పిల్లల చదువులకు ఎలాగూ ఖర్చులు ఉంటాయి. జీతం వస్తున్నంత కాలం కొంచెం ఇబ్బందిపడుతూనే నరేశ్ కుటుంబాన్ని నెట్టుకొచ్చేవారని, కానీ రెండు నెలలుగా జీతాలు అందకపోవడంతో తీవ్ర ఆర్ధిక సమస్యలలో కూరుకుపోయడని చెప్పారు. ఆర్టీసీ సమ్మెపై టీవీలో వస్తున్న వార్తలను చూసి తీవ్ర ఆందోళన చెందుతుండేవాడని తోటి ఆర్టీసీ కార్మికులు చెప్పారు. డ్రైవర్ నరేశ్ ఒక్కడే కాదు...48,000 కార్మికుల పరిస్థితి ఇలాగే ఉందన్నారు. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం చర్చలు మొదలుపెట్టి సమస్యను పరిష్కరించాలని కోరారు.

ఆత్మహత్యకు ముందు నరేశ్ ఒక లేఖ (సూసైడ్ నోట్) వ్రాశారు. దానిలో తన చావుకు సిఎం కేసిఆరే కారణమని, ఆర్టీసీ కార్మికుల సమస్యలు తన చావుతో పరిష్కారం కావాలని, ఆర్టీసీలో ఇదే చివరి బలిదానం కావాలని కోరుకొంటున్నానని వ్రాశారు.