రాష్ట్ర బిజెపి విమర్శలు...కేంద్రం ప్రశంశలు: భట్టి

మిషన్ భగీరధ పధకం చాలా అద్భుతంగా ఉందని దానిని దేశమంతటా అమలుచేస్తామని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్రనాథ్ షెకావత్ చెప్పడంపై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క స్పందిస్తూ, “మిషన్ భగీరధ పధకంలో భారీగా అవినీతి జరిగిందని రాష్ట్ర బిజెపి నేతలు ఆరోపిస్తుంటే, దాని గురించి సిఎం కేసీఆర్‌ కేంద్రమంత్రికి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వడం, అది చూసి ఆయన ఆ పధకం చాలా అద్భుతంగా ఉందని దానిని దేశమంతటా అమలుచేస్తామని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. మిషన్ భగీరధ పధకం రాష్ట్రంలో అతిపెద్ద స్కామ్ అని బిజెపి నేతలు వాదిస్తున్నారు. అంటే ఇప్పుడు ఆ స్కామును జాతీయస్థాయికి విస్తరించదలిచారా?అసలు తెరాస-బిజెపిల మద్య ఏమి జరుగుతోంది? ఆ రెండు పార్టీల మద్య ఉన్న రహస్య అవగాహన ఏమిటి? రెండు పార్టీలు కలిసి రాష్ట్ర ప్రజలను తప్పుద్రోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయి. మిషన్ భగీరధ పధకంలో జరిగిన అవినీతిపై సిబిఐ విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది,” అని అన్నారు. 

ఈ సందర్భంగా భట్టి విక్రమార్క సిఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. సిఎం కేసీఆర్‌ అనాలోచిత వ్యవహార శైలితో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను అస్తవ్యస్తం చేశారు. ఆర్టీసీ, రెవెన్యూ వ్యవస్థలను రోడ్డున పడేశారు. ఒక మహిళా తహశీల్దార్‌ను ఆమె కార్యాలయంలోనే సజీవదహనం చేస్తే సిఎం కేసీఆర్‌ స్పందించలేదు. తోటి ఉద్యోగి హత్యను నిరసిస్తూ రెవెన్యూ ఉద్యోగులు ఆందోళన బాటపడితే వారితో మాట్లాడేందుకు సిఎం కేసీఆర్‌కు ఆసక్తి లేదు కానీ కేంద్రమంత్రికి మిషన్ భగీరధ పధకం గురించి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వడానికి సమయం కేటాయిస్తారు,” అంటూ తీవ్ర విమర్శలు చేశారు.