తెలంగాణ ప్రభుత్వోద్యోగులకు త్వరలో వేతనసవరణ

తెలంగాణ ప్రభుత్వోద్యోగులకు త్వరలో వేతనసవరణ జరుగనుంది. తెలంగాణ ఏర్పడిన తరువాత 2015 ఫిబ్రవరి 5న తొలిసారిగా 43 శాతం ఫిట్‌మెంట్‌తో ప్రభుత్వోద్యోగులకు పిఆర్సీ లభించింది. తెలంగాణ ప్రభుత్వోద్యోగుల పిఆర్‌సీ గడువు ఈ ఏడాది జూన్ 30తో ముగిసింది. కనుక వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని సిఎం కేసీఆర్‌ వేతనసవరణ సంఘాన్ని(పిఆర్‌సీ) ఆదేశించారు. పిఆర్‌సీ నివేదికతో ఉద్యోగుల జీతాలు పెంచడం వలన ప్రభుత్వంపై ఎంత అధనపు భారం పడుతుందనేదానిపై స్పష్టత వస్తుంది. అప్పుడు దాని ఆధారంగా మంత్రులు లేదా ఐఏఎస్‌ అధికారులతో ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేస్తుంది. నిజానికి దీనికోసం ప్రభుత్వం గత ఏడాది మేనెలలోనే ముగ్గురు ఐఏఎస్‌ అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ వారు ఇంతవరకు నివేదిక ఇవ్వకపోవడంతో, పిఆర్‌సీ నివేదిక ఆధారంగా త్వరలోనే మరో కమిటీని నియమించనుంది. కమిటీ సభ్యులు ఉద్యోగ, పెన్షనర్ సంఘాలతో చర్చించిన తరువాత వేతనసవరణపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకొంటుంది. 

రాష్ట్రంలో త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరుగనున్నాయి. మరోపక్క ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రభుత్వం ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటోంది. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ప్రభుత్వోద్యోగ సంఘాలు మద్దతు తెలిపాయి.  కనుక వారు ఆర్టీసీ కార్మికులతో చేతులు కలపకుండా నివారించేందుకు, మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వోద్యోగులకు వేతనసవరణ ప్రక్రియను ప్రారంభించి ఉండవచ్చు. ప్రభుత్వం ఏ కారణంతో ఈ నిర్ణయం  తీసుకొన్నప్పటికీ, అది రాష్ట్రంలో 3.5 లక్షల మంది ప్రభుత్వోద్యోగులకు, 2 లక్షల మంది పింఛనుదారులకు చాలా లబ్ది కలిగిస్తుంది.