టిఎన్ శేషన్ మృతి

మాజీ కేంద్ర ఎన్నికల ప్రధాన కమీషనర్ టిఎన్ శేషన్ (87) చెన్నైలోని తన స్వగృహంలో ఆదివారం రాత్రి మృతి చెందారు. గత కొంత కాలంగా ఆయన వృద్ధాప్య సంబందిత ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. 

ఒకప్పుడు దేశంలో ఎన్నికలు జరిగేటప్పుడు ఎన్నికల కమీషన్‌నుఎవరూ పెద్దగా పట్టించుకొనేవారు కాదు. రాజకీయ పార్టీలు ఎన్నికలలో ఎన్ని అవకతవకలకు పాల్పడుతున్నప్పటికీ ఎన్నికల సంఘం కూడా చూసిచూడనట్లు వ్యవహరిస్తుండేది. టిఎన్ శేషన్ బాధ్యతలు చేపట్టిన తరువాత ఎన్నికల సంఘాన్ని, అది పనిచేసే విధానాన్ని సమూలంగా మార్చివేశారు. రాజ్యాంగంలో పేర్కోన్నట్లుగా ఎన్నికల సంఘాలకు గల అపరిమిత అధికారాలను అమలుచేసి చూపించారు. ఆయన హయాం నుంచే ఎన్నికల నియామవళిని ఖచ్చితంగా అమలుచేయడం ప్రారంభం అయ్యిందని చెప్పవచ్చు. ఓటర్లకు గుర్తింపు కార్డులు జారీ, ఎన్నికల కోడ్ అమలు, ఆ సమయంలో ఎన్నికల సంఘానికి విశేషాధికారాలతో అధికార పార్టీలతో సహా అన్ని రాజకీయపార్టీలను, వాటి అభ్యర్ధులను కట్టడి చేయడం, అధికారపార్టీలు ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయకుండా...ప్రభుత్వ వాహనాలను వాడకుండా అడ్డుకోవడం, ఎన్నికల ఖర్చులకు పరిమితులు విధించి వాటికి లెక్కలు సమర్పించేలా చేయడం, మద్యం, డబ్బు, బహుమతుల పంపిణీని అరికట్టేందుకు ఎన్నికల పరిశీలకుల నియామకం వంటి అనేకానేక సంస్కరణలు అమలుచేసి అధికార పార్టీలు కూడా ఎన్నికల సంఘాన్ని చూసి భయపడే పరిస్థితి కల్పించారు. ఆయన వలన తీవ్ర ఇబ్బందిపడిన దేశంలోని అధికార, ప్రతిపక్షపార్టీలు ఆయనపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న సమయంలోనే ఎన్నికల సంఘం పనితీరును, ఎన్నికల ప్రక్రియను సమూలంగా మార్చి అత్యంత సమర్ధంగా ఎన్నికలను నిర్వహించినందుకు ఆయనకు 1996 రామన్ మెగసెసె అవార్డు లభించడం విశేషం.     

టిఎన్ శేషన్ కేరళలోని పాలక్కాడ్ జిల్లా తిరునెళ్ళాయిలో 1932లో జన్మించారు. హార్వర్డ్ యూనివర్సిటీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో పీజీ చేశారు. 1955లో ఐఏస్‌ పూర్తిచేసి అనేక ఉన్నతపదవులలో పనిచేశారు. 1990 నుంచి 1996 వరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమీషనర్‌గా పనిచేశారు. 1997లో రాష్ట్రపతి పదవికి పోటీ చేశారు. ఒకవేళ టిఎన్ శేషన్ రాష్ట్రపతి అయ్యుంటే ప్రభుత్వ పనితీరును కూడా పూర్తిగా సంస్కరించి ఉండేవారేమో? కానీ కెఆర్ నారాయణన్ చేతిలో ఓడిపోయారు. 

ఆర్టీసీ సమ్మె కేసులో ఐఏస్‌ అధికారులు హైకోర్టు బోనులో నిలబడి చివాట్లు తింటూ క్షమాపణలు చెప్పుకొంటుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. కానీ ఒక ఐఏస్‌ అధికారికి రాజ్యాంగంలో సూచించిన విధంగా చట్టాలను అమలుచేసే ధైర్యం, గుండె నిబ్బరం ఉన్నట్లయితే ఏవిధంగా ఉంటుందో టిఎన్ శేషన్ నిరూపించి చూపారు.