తెలంగాణకు అదనపు రోడ్లు మంజూరు చేయాలి: ఎర్రబెల్లి

కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధ్వర్యంలో హైదరాబాద్‌ హరిత ప్లాజాలో ప్రధాన మంత్రి గ్రామసడక్‌యోజన (పీఎంజిఎస్‌వై)ఈ-మార్గ్ కు సంబందించి శిక్షణాకార్యక్రమం జరుగుతోంది. శుక్రవారం దాని ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కేంద్ర బృందంలోని అధికారులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “దేశంలో మరెక్కడా లేనన్ని సంక్షేమ పధకాలు తెలంగాణ రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతున్నాయి. అభివృద్ధిలో కూడా తెలంగాణ రాష్ట్రం దేశంలో మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. ప్రధాన మంత్రి గ్రామసడక్‌యోజన పధకంలో భాగంగా కేంద్రప్రభుత్వం 2019-20 సం.లలో తెలంగాణ రాష్ట్రానికి 2,4727.50 కిమీ రోడ్లు మంజూరు చేసింది. అయితే తెలంగాణ రాష్ట్రం మరింత వేగంగా అభివృద్ధి చెందేందుకు ఏడాదికి కనీసం 4,000 కిమీ రోడ్లను మంజూరు చేయాలని కోరుతున్నాను. సమైక్య రాష్ట్రంలో జరిగిన కొన్ని సాంకేతిక తప్పిదల వలన రాష్ట్రంలో రోడ్డు మార్గం కూడా లేని 534 గ్రామాలకు తారురోడ్లు ఉన్నట్లు రికార్డులలో పేర్కొనడంతో వాటికి తీరని అన్యాయం జరిగింది. కనుక ఆ  534 గ్రామాలకు తారురోడ్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.