మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన?

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో కలిసి పోటీ చేసిన బిజెపి-శివసేనల మద్య ముఖ్యమంత్రి పదవిపై ప్రతిష్టంభన ఏర్పడటంతో నేటి వరకు ప్రభుత్వం ఏర్పాటు కాలేదు. ఈరోజు అర్ధరాత్రితో గత అసెంబ్లీ పదవీకాలం ముగుస్తుంది కనుక ఇప్పటి వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న దేవేంద్ర ఫడ్నవీస్ ఈరోజు సాయంత్రం మహారాష్ట్ర గవర్నర్‌   భగత్‌సింగ్‌ కోశ్యారిని కలిసి తన రాజీనామా లేఖను అందజేశారు. 

అనంతరం మీడియాతో మాట్లాడుతూ తన రాజీనామాను గవర్నర్‌ ఆమోదించారని తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటుకు బిజెపి సానుకూలంగా ఉన్నప్పటికీ మిత్రపక్షమైన శివసేన కలిసి రాకపోవడం వలననే ఇటువంటి పరిస్థితి ఏర్పడిందన్నారు. బిజెపి అధిష్టానంతో చర్చించిన తరువాత తమ తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని ఫడ్నవీస్ చెప్పారు. 

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి 105, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్‌ 44 సీట్లు గెలుచుకొన్నాయి. బిజెపి, శివసేనలు కలిసే పోటీ చేశాయి కనుక రెండు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు. కానీ ఈసారి ముఖ్యమంత్రి పదవి కోసం శివసేన గట్టిగా పట్టుబట్టడంతో బిజెపి అందుకు నిరాకరించింది. కనీసం రెండున్నరేళ్లు చొప్పున రెండు పార్టీలు ముఖ్యమంత్రి పదవిని చేపడదామనే శివసేన ప్రతిపాదనను కూడా బిజెపి నిర్ద్వందంగా తిరస్కరించడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. 

ఇది చూసి కాంగ్రెస్‌, ఎన్సీపీలు శివసేనతో చేతులు కలిపి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే ఆలోచన చేశాయి కానీ అతివాద శివసేనతో వేగలేమనే భయంతో ప్రతిపక్ష బెంచీలలో కూర్చోనేందుకే మొగ్గు చూపాయి. ఈరోజు అర్ధరాత్రిలోగా బిజెపి, శివసేనల మద్య రాజీ కుదరకపోతే మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించవచ్చు.