ఊహించినట్లుగానే ఆర్టీసీ కార్మిక సంఘాలు రేపు తలపెట్టిన ‘ఛలో ట్యాంక్ బండ్’ కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. కనుక ఆర్టీసీ జేఏసీ, అఖిలపక్ష నేతలు ప్రస్తుతం మగ్దూం భవన్‌లో అత్యవసర సమావేశమయ్యారు. తమ కార్యక్రమానికి అనుమతి కోరుతూ బహుశః వారు ఈరోజు హైకోర్టులో పిటిషన్ వేయవచ్చు. దానిపై హైకోర్టు ఏవిధంగా స్పందిస్తుందో తరువాత తెలుస్తుంది.
పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ రేపు మధ్యాహ్నం ట్యాంక్ బండ్‌పై కనీసం లక్షలమందితో భారీ ర్యాలీ నిర్వహించాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు, అఖిలపక్ష నేతలు నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అన్ని జిల్లాల నుంచి ఆర్టీసీ కార్మికులు హైదరాబాద్ తరలిరావాలని ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వథామరెడ్డి పిలుపునిచ్చారు. ఛలో ట్యాంక్ బండ్ కార్యక్రమానికి మద్దతు ప్రకటించిన ప్రతిపక్షపార్టీలు కూడా తమ కార్యకర్తలను హైదరాబాద్ తరలిరావాలని కోరాయి.
కనుక రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు ఎక్కడికక్కడ ఆర్టీసీ కార్మికులను, ప్రతిపక్ష కార్యకర్తలను, నేతలను అరెస్ట్ చేయడం ప్రారంభించారు. ఆర్టీసీ జేఏసీ, అఖిలపక్ష నేతలు తీవ్రంగా ఖండిస్తున్నప్పటికీ అరెస్టులు కొనసాగుతున్నాయి. ఒకవేళ రేపటి ఈ కార్యక్రమానికి హైకోర్టు ఆంక్షలతో కూడిన అనుమతి మంజూరు చేస్తే ప్రశాంతంగా ముగియవచ్చు లేకుంటే పోలీసులకు, ఆర్టీసీ కార్మికలు, ప్రతిపక్షాలకు మద్య రేపు తీవ్రస్థాయిలో ఘర్షణలు జరిగే ప్రమాదం పొంచి ఉంది.