ఆర్టీసీ సమ్మె నేటితో 35వ రోజుకు చేరుకొంది. సమ్మెలో భాగంగా శనివారం ‘ఛలో ట్యాంక్ బండ్’ పేరుతో ఆర్టీసీ కార్మికులు, ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు ట్యాంక్ బండ్పై నిరసన కార్యక్రమం చేపట్టనున్నాయి. ఈ కార్యక్రమానికి అన్ని ప్రతిపక్షపార్టీలు, ఎంఆర్పిఎస్, విద్యార్ధి, ప్రజాసంఘాలు మద్దతు ప్రకటించడమే కాకుండా దానిలో పాల్గొంటామని చెప్పాయి కనుక రేపు రాష్ట్రం నలుమూలల నుంచి చాలా భారీ సంఖ్యలో ప్రజలు హైదరాబాద్కు తరలివచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది.
అయితే సరూర్నగర్లో సభకే పోలీసులు అనుమతి నిరాకరించినప్పుడు లక్షలాదిమందితో హైదరాబాద్ నగరం నడిబొడ్డున ట్యాంక్ బండ్పై నిరసన కార్యక్రమం చేపడతామంటే అంగీకరిస్తారనుకోలేము. కనుక ఆర్టీసీ కార్మిక సంఘాలు మళ్ళీ దీనికోసం కూడా హైకోర్టును ఆశ్రయించకతప్పదు. ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్దంగా సభలు, సమావేశాలు నిర్వహించుకోవడానికి హైకోర్టు అనుమతించవచ్చు కానీ హింసాయుత ఘటనలు జరిగే అవకాశం ఉన్న ఇటువంటి కార్యక్రమానికి అనుమతించకపోవచ్చు.
ఒకవేళ హైకోర్టు అనుమతించకపోయినా ఆర్టీసీ కార్మిక సంఘాలు రేపు ‘ఛలో ట్యాంక్ బండ్’ కార్యక్రమం చేప్పట్టినట్లయితే అప్పుడు పోలీసులు తప్పకుండా వారిని అడ్డుకొనేందుకు ప్రయత్నిస్తారు. అదే జరిగితే హైదరాబాద్ రణరంగంగా మారే ప్రమాదం ఉంటుంది. కనుక అటువంటి పరిస్థితులు రానీయకుండా చూడవలసిన బాధ్యత ఆర్టీసీ కార్మిక సంఘాలు, ప్రతిపక్షాలు, ప్రభుత్వం, పోలీసులు, హైకోర్టుపైనే ఉంటుంది.