
సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు టీఎస్‌ఆర్టీసీ ఇన్-ఛార్జ్ ఎండీ సునీల్ శర్మ ఒక విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ కార్మికులు తాము పనిచేస్తున్న డిపోల మేనేజర్లకే కాక జిల్లా రీజినల్ మేనేజర్, జిల్లా కలెక్టర్, ఎస్పీ, డీఎస్పీ, ఆర్డీవో, డీవిఎం కార్యాలయాలలో ఎక్కడైనా కూడా తమ జాయినింగ్ లెటర్స్ (సమ్మె విరమించి బేషరతుగా విధులలో చేరుతున్నట్లు అంగీకారపత్రాలు) సమర్పించవచ్చునని తెలిపారు. హైదరాబాద్‌లో పని చేస్తున్న ఆర్టీసీ కార్మికులు బస్‌భవన్లో గల ఈడీ కార్యాలయంలో జాయినింగ్ లెటర్స్ ఇవ్వవచ్చునని తెలిపారు. మంగళవారం అర్ధరాత్రిలోగా విధులలో చేరేందుకు సిఎం కేసీఆర్ ఇచ్చిన చివరి అవకాశాన్ని ఆర్టీసీ కార్మికులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. విధులలో చేరితే వారికి పూర్తి భద్రత కల్పిస్తామని చెప్పారు. సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు ఈరోజు అర్ధరాత్రిలోగా విధులలో చేరకపోతే ఆర్టీసీని పూర్తిగా ప్రైవేట్ పరం చేస్తామని సిఎం కేసీఆర్ మొన్న హెచ్చరించిన సంగతి తెలిసిందే.
సిఎం కేసీఆర్ హెచ్చరికలతో ఆర్టీసీ కార్మికులు తీవ్ర కలవరం చెందినప్పటికీ 49,800 మందిలో కేవలం 10-15 మంది మాత్రమే విధులలో చేరేందుకు లేఖలు ఇవ్వడం గమనిస్తే, సిఎం కేసీఆర్ హెచ్చరికలకు వారు ఏమాత్రం భయపడలేదని స్పష్టం అవుతోంది.