
గత 31 రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఒక సూచన చేశారు. హైదరాబాద్ మజ్లీస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఒక సమావేశంలో అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ, “ఆర్టీసీ కార్మికుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని సిఎం కేసీఆర్ కొన్ని కీలకనిర్ణయాలు తీసుకొంటున్నారు. కనుక ఆయనపై నమ్మకం ఉంచి గడువు (మంగళవారం అర్ధరాత్రి)లోగా ఆర్టీసీ కార్మికులందరూ మళ్ళీ విధులలో చేరి తమ ఉద్యోగాలను, కుటుంబాలను కాపాడుకోవాలని కోరుతున్నాను. కాంగ్రెస్, బిజెపిలు తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసమే ఆర్టీసీ సమ్మెకు మద్దతు ఇస్తున్నాయి తప్ప మీపై ప్రేమతో కాదని గ్రహించాలి. కనుక వాటి ఉచ్చులో చిక్కుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. ఆర్టీసీలో ప్రైవేట్ బస్సులు ప్రవేశపెడుతున్నప్పటికీ ఆర్టీసీ వ్యవస్థాపకుల గౌరవార్ధం ఆర్టీసీ నెంబరు ప్లేట్లపై ఏర్పాటు చేసిన ‘జెడ్’ అనే అక్షరం యధాతధంగా కొనసాగించాలని సిఎం కేసీఆర్కు విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.
నెంబర్ ప్లేట్లపై ఉండే ‘జెడ్’ అనే అక్షరం కొనసాగింపుపై అసదుద్దీన్ ఓవైసీ కనబరిచిన శ్రద్ద, చనిపోతున్న ఆర్టీసీ కార్మికుల పట్ల చూపలేకపోయారు. నెంబరు ప్లేట్లపై ఏర్పాటు చేసిన ‘జెడ్’ అక్షరాన్ని కొనసాగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు కానీ చర్చల ద్వారా ఆర్టీసీ సమస్యలను పరిష్కరించుకోవాలని ప్రభుత్వాన్ని కోరాలనుకోలేదు.