కేసీఆర్‌ హెచ్చరికలతో ఆర్టీసీ యూనియన్లలో చీలిక?

గత నెలరోజులుగా సమ్మె చేస్తున్న టిఎస్ఆర్టీసీ కార్మికులు మంగళవారం అర్ధరాత్రిలోగా విధులలో చేరాలని లేకుంటే ఆర్టీసీని మొత్తం ప్రైవేటీకరిస్తామని సిఎం కేసీఆర్‌ చేసిన తాజా హెచ్చరికలతో టీఎస్‌ఆర్టీసీ కార్మికులలో కలకలం మొదలైంది.  టీఎస్‌ఆర్టీసీ యూనియన్లలో చీలిక కూడా ఏర్పడినట్లే కనిపిస్తోంది. 

సిఎం కేసీఆర్‌ హెచ్చరికలతో ఆదివారం రాత్రి వరకు మొత్తం 12 మంది ఆర్టీసీ కార్మికులు విధులలో చేరారు. విధులలో చేరిన వారిలో హైదరాబాద్‌ ఉప్పల్ డిపోకు చెందిన అసిస్టెంట్ మేనేజర్, మరో ఇద్దరు కార్మికులు, మిర్యాలగూడ, సిద్ధిపేట డిపోలలో ఇద్దరు కండక్టర్లు, బండ్లగూడలో ఒక మహిళా కండక్టర్, కామారెడ్డిలో ఒక డ్రైవర్, సత్తుపల్లిలో ఒక్ డ్రైవర్ విధులలో చేరారు. తాము బేషరతుగా విధులలో చేరుతున్నామని, ఇకపై యూనియన్లకు దూరంగా ఉంటామని వారు లిఖితపూర్వకంగా తెలియజేస్తూ డిపో మేనేజర్లకు లేఖలు ఇచ్చి విధులలో చేరారు. సిఎం కేసీఆర్‌ పెట్టిన గడువు సమీపిస్తుండటంతో ఈ 24 గంటలలోఇంకా అనేకమంది విధులలో చేరే అవకాశం కనిపిస్తోంది. 

సిఎం కేసీఆర్‌ తీవ్ర హెచ్చరికల నేపధ్యంలో ఆర్టీసీ యూనియన్ల మద్య కూడా చీలికలు ఏర్పడినట్లే కనిపిస్తున్నాయి. ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వథామరెడ్డి సమ్మెను కొనసాగిస్తామని చెప్పి కార్యాచరణ కూడా ప్రకటించగా, మిగిలిన యూనియన్లలో ఒకరిద్దరు నేతలు “ఇంకా ఎన్ని రోజులు సమ్మె కొనసాగించాలి?సమ్మె కొనసాగితే మా పరిస్థితి ఏమిటి?” అని ప్రశ్నిస్తున్నారు. కనుక సమ్మె కొనసాగింపుపై ఆర్టీసీ యూనియన్లలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నట్లు స్పష్టం అయ్యింది. నేడు ఆర్టీసీలో మూడు ప్రధాన యూనియన్లు వేర్వేరుగా అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేసుకొంటున్నాయి. కనుక వాటిలో కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. అవి ఏవిధంగా ఉండబోతున్నాయనేది మరికొద్ది సేపటిలో స్పష్టత వస్తుంది.