ఆర్టీసీ కార్మికులకు ఇదే చివరి అవకాశం: సిఎం కేసీఆర్‌

ఈరోజు ప్రగతి భవన్‌లో జరిగిన తెలంగాణ మంత్రివర్గ సమావేశం ముగిసిన వెంటనే సిఎం కేసీఆర్‌ ప్రెస్‌మీట్‌ పెట్టి ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వ వైఖరిని మరోసారి స్పష్టం చేశారు. ఆ వివరాలు: 

1. నవంబర్ 5వ తేదీ అర్ధరాత్రిలోగా ఆర్టీసీ కార్మికులు బేషరతుగా విధులలో చేరాలి. ఇదే వారికి చివరి అవకాశం. దీనిని ఆర్టీసీ కార్మికులు సద్వినియోగపరుచుకోవాలని కోరుతున్నాను. బేషరతుగా విధులలో చేరితే వారిని ప్రభుత్వం కాపాడుతుంది. లేకుంటే వారు, వారి కుటుంబాలో రోడ్డున పడతారు. వారిని ఆర్టీసీ జేఏసీ నేతలు, ప్రతిపక్షాలు కాపాడలేరని గ్రహించాలి. 

2. ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్దం. మా ప్రభుత్వం మంచిది కనుక ఆర్టీసీ కార్మికులకు ఇంకా ఉపేక్షిస్తున్నాము. వారు మారకపోతే లేబర్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకొంటే వారికి మాతో ఇక సంబంధాలే ఉండవు.   

3. ఆర్టీసీలో 5,100 మార్గాలలో ప్రైవేట్ బస్సులకు అనుమతులు మంజూరు చేశాము. ఒకవేళ ఆర్టీసీ కార్మికులు గడువులోగా చేరకపోతే మిగిలిన రూట్లను కూడా ప్రైవేట్ సంస్థాలకు అప్పగించడానికి వెనుకాడబోము. 

4. ఆర్టీసీ బస్సులు లాభదాయక రూట్లలో, అద్దె, ప్రైవేట్ బస్సులు పెద్దగా లాభాలు లేని పల్లెవెలుగు వంటి మార్గాలలో నడుస్తాయి. 

5. అద్దె, ప్రైవేట్ బస్సులపై రెగ్యులేటరీ కమిటీ నియంత్రణ ఉంటుంది. టికెట్ ధరలు పెంపు, రూట్ల పంపిణీ మొదలైన ప్రతీ అంశంపై రెగ్యులేటరీ కమిటీ నియంత్రిస్తుంది. 

6. గతంలో మరే ప్రభుత్వం ఇవ్వనివిధంగా మా ప్రభుత్వం నాలుగేళ్లలో ఆర్టీసీ కార్మికులకు 67 శాతం ఇంక్రిమెంట్లు ఇచ్చాము. ఇంకా ఇవ్వలంటే సాధ్యం కాదు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదు. ఇది మంత్రివర్గ నిర్ణయం. 

7. ఆర్టీసీకి ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీలు ఎటువంటి బాకీలు లేవు. ప్రభుత్వం ఇచ్చిన ప్రతీ పైసాకు ఖచ్చితమైన ఆడిటింగ్ లెక్కలున్నాయి. 

8. కేంద్రప్రభుత్వం మోటారు వాహనాల చట్టానికి సవరణలు చేసినప్పుడు నలుగురు తెలంగాణ బిజెపి ఎంపీలు ఓటు వేశారు. వారే ఇప్పుడు ఆర్టీసీ సమ్మెను బలపరుస్తున్నారు. 

9. ప్రతిపక్షాలు శవరాజకీయాలు చేస్తున్నాయి. ఉమాభారతి, బాబూలాల్ గౌడ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీసీని రద్దు చేశారు. ఆ రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం చేసిన దానిని గురించి మాట్లాడకుండా ఇక్కడ శవరాజకీయాలు చేస్తున్న బిజెపి నేతలు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి.

10. ఛత్తీస్‌ఘడ్‌లో అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ రూ.2 లక్షలు పంట రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చింది. కానీ ఇంతవరకు చేయలేదు. 

11.  బుద్దిగా పనిచేసుకొంటున్న ఆర్టీసీ కార్మికులను యూనియన్ నేతలు, ప్రతిపక్షాలే రెచ్చగొట్టి చట్ట వ్యతిరేకమైన సమ్మెలోకి దించారు. కనుక ఆర్టీసీ కార్మికులు మరణాలకు వారిదే బాధ్యత. వారే నేరస్తులు. 

12. ఆర్టీసీ కార్మికులకు అవకాశం ఇవ్వకపోతే మాది తప్పు. ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోకపోతే వారిదే తప్పు. అప్పుడు తెలంగాణ కూడా మధ్యప్రదేశ్ రాష్ట్రంలాగ ఆర్టీసీరహిత రాష్ట్రంగా ఉంటుంది. ప్రైవేట్ బస్సులు తిరుగుతుంటాయి. అంతే తేడా. 

13. ఆర్టీసీలో ఆరోగ్యకరమైన పోటీ ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఆర్టీసీని 50:50 నిష్పత్తిలో నడిపించాలని భావిస్తున్నాము. 

14. హైకోర్టులో న్యాయవాది చెప్పిన మాటలను హైకోర్టు చెప్పినట్లుగా మీడియాలో వ్రాస్తున్నారు.