
నాలుగు రోజుల క్రితం సరూర్‌నగర్ సభలోగుండెపోటుతో మరణించిన కరీంనగర్ 2వ డిపో డ్రైవర్ నగునూరి బాబు అంత్యక్రియల సందర్భంగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడంతో నిన్న కరీంనగర్ రణరంగంగా మారిపోయింది. అంతిమయాత్రలో పాల్గొనేందుకు చుట్టుపక్కల జిల్లాల నుంచి వేలాదిగా ఆర్టీసీ కార్మికులు తరలివచ్చారు. కాంగ్రెస్, బిజెపి, వామపక్షాలు, టిడిపి, ఎంఆర్పిఎస్ నేతలు కార్యకర్తలు కూడా తరలివచ్చారు. డ్రైవర్ బాబు కుటుంబ సభ్యుల అభ్యర్ధన మేరకు ఆయన పనిచేసిన కరీంనగర్ 2వ డిపో మీదుగా అంతిమయాత్ర చేపట్టారు. దాంతో వారు డిపో వద్దకు చేరుకొంటే ఆవేశంలో విధ్వంసానికి పాల్పడవచ్చనే ఉద్దేశ్యంతో పోలీసులు వారిని అడ్డుకొనే ప్రయత్నం చేయడంతో సుమారు గంటసేపు వారిమద్య తోపులాట జరిగింది.
పోలీసులు ప్రతిపక్షనేతలను, ఆర్టీసీ జేఏసీ నేతలను అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించే ప్రయత్నం చేయడంతో ఆర్టీసీ కార్మికులు రోడ్డుకు అడ్డంగా టైర్లు వేసి మంటపెట్టి అడ్డుకొనే ప్రయత్నం చేశారు. అదేసమయంలో పోలీసులు నగునూరి బాబు మృతదేహాన్ని హడావుడిగా శ్మశానవాటికకు తరలింపజేయడంతో ఆర్టీసీ కార్మికులు అడ్డుకొన్నారు. కానీ పోలీసులు మృతదేహాన్ని బలవంతంగా శ్మశానవాటికకు తరలింపజేసి ఆయన కుమారుడి చేత అంత్యక్రియలు పూర్తి చేయించారు. ఈ సందర్భంగా అక్కడ తీవ్ర ఉద్రిక్తవాతావరణం నెలకొంది.
డ్రైవర్ నగునూరి బాబు అంత్యక్రియలకు హాజరైన బిజెపి ఎంపీ బండి సంజయ్‌ను పక్కకు లాగే ప్రయత్నంలో ఒక పోలీస్ అధికారి ఆయన మెడపై చెయ్యి వేయడంతో ఒక్కసారిగా అక్కడ తీవ్ర ఉద్రిక్తవాతావరణం ఏర్పడింది. సదరు అధికారి క్షమాపణలు చెప్పాలంటూ అందరూ రోడ్డుపై బైటాయించి చాలాసేపు ధర్నా చేశారు. పోలీసులు వారినందరినీ అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలించిన తరువాత మళ్ళీ డ్రైవర్ బాబు అంతిమయాత్ర మొదలైంది.
టిజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్, ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ, కాంగ్రెస్ నేతలు జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడవెంకట్‌రెడ్డి, ఆయా పార్టీల కార్యకర్తలు, ఆర్టీసీ జేఏసీ నేతలు, ఆర్టీసీ కార్మికులు అరేపల్లికి తరలివచ్చి డ్రైవర్ నగునూరి బాబు అంతిమయాత్రలో పాల్గొని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.