
ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ ఈరోజు షెడ్యూల్ ప్రకటించింది. ప్రధాన ఎన్నికల కమీషనర్ సునీల్ అరోరా, కమీషనర్ సుశీల్ చంద్ర డిల్లీలో ఈరోజు సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. ఝార్ఖండ్ చాలా చిన్న రాష్ట్రమే అయినప్పటికీ, చాలా నియోజకవర్గాలు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు కావడంతో 81 అసెంబ్లీ స్థానాలకు 5 దశలలో ఎన్నికలు నిర్వహించి డిసెంబర్ 23న ఫలితాలు వెల్లడిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్:
నవంబర్ 6: నోటిఫికేషన్ వెలువడుతుంది. నవంబర్ 30న తొలి దశలో 13 స్థానాలకు, డిసెంబర్ 7న రెండవ దశలో 20 స్థానాలకు, డిసెంబర్ 12న మూడవ దశలో 17 స్థానాలకు, డిసెంబర్ 16న నాలుగవ దశలో 15 స్థానాలకు, డిసెంబర్ 20న చివరిదశలో మిగిలిన 16 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు.
ప్రస్తుతం ఝార్ఖండ్‌లో బిజెపి అధికారంలో ఉంది. గత అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి: 37, ఝార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (జెఎస్‌యు): 6, కాంగ్రెస్: 8, ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జెఎమ్ఎమ్) 18 సీట్లు గెలుచుకొన్నాయి. ఎన్నికల అనంతరం బిజెపి, జెఎస్‌యు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.