
టీఎస్ఆర్టీసీకి ప్రభుత్వమూ, జీహెచ్ఎంసీ బాకీలు చెల్లింపు విషయంలో ప్రభుత్వం కొత్త ట్విస్ట్ ఇవ్వబోతోంది. ఇంతకు ముందు ఆర్టీసీ బకాయిలపై హైకోర్టులో విచారణ జరిగినప్పుడు ఏపీ, తెలంగాణ ఆర్టీసీ ఆస్తులు, అప్పులు పంపకాలు పూర్తికాలేదని సాకు చెప్పిన తెలంగాణ ప్రభుత్వం, ఈరోజు జరుగబోయే విచారణలో ఆర్టీసీకి ఎటువంటి బకాయిలు చెల్లించవలసిన అవసరం లేదని వాదించబోతోంది.
హైకోర్టు ఆదేశాల మేరకు ఈరోజు ఆర్టీసీ ఇన్-ఛార్జ్ ఎండీ సునీల్ శర్మ విచారణకు హాజరుకాబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆర్టీసీ బకాయిలపై రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం తరపున హైకోర్టుకు బకాయిలపై ఒక అఫిడవిట్ సమర్పించబోతున్నారు. దానిలో ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం 2018-19 సం.లకు గాను మొత్తం రూ.644.51 కోట్లు విడుదల చేసిందని, దానిని వివిద పద్దుల క్రింద ఆర్టీసీ వినియోగించుకోవచ్చునని పేర్కొన్నారు. కనుక రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి ఎటువంటి బాకీ లేదని చెప్పబోతున్నారు.
ఆర్టీసీకి జీహెచ్ఎంసీ రూ.1,786.06 కోట్లు చెల్లించవలసి ఉండగా, 2015-2017 సం.లలో రూ.336.40 కోట్లు చెల్లించిందని, మిగిలిన సొమ్ము చెల్లించే స్థోమతు లేదని ప్రభుత్వానికి లేఖ వ్రాయడంతో జీహెచ్ఎంసీ నిబందనల ప్రకారం సముచిత నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం సూచించిందని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ నిబందనల ప్రకారం ఆర్టీసీ నష్టాలను భరించవలసిన అవసరం జీహెచ్ఎంసీకి లేదు కనుక ఆర్టీసీకి జీహెచ్ఎంసీ ఎటువంటి బకాయిలు చెల్లించనవసరం లేదని అఫిడవిట్లో పేర్కొన్నారు.
ఆర్టీసీ నష్టాలకు కారణాలు:
ఆర్టీసీ నిర్వహణ, డీజిల్ ధరల పెరుగుదల, సమ్మెలు కారణంగా ఆర్టీసీ నష్టాలలో కూరుకుపోయిందని ప్రభుత్వం వాదించబోతోంది. కానీ బారీగా పేరుకుపోయిన బకాయిలు, ప్రభుత్వ నిర్ణయాలు, ఆర్టీసీ యాజమాన్యం అసమర్ధత, డీజిల్, విడిభాగాల ధరలు పెరుగుదల కారణంగా ఆర్టీసీ నష్టపోయిందని ఆర్టీసీ కార్మిక సంఘాలు వాదిస్తున్నాయి.
అక్టోబర్ 5న ఆర్టీసీ సమ్మె మొదలైనప్పటి నుంచి అక్టోబర్ 30 వరకు ఆర్టీసీకి రూ.78 కోట్లు ఆదాయం, రూ.160 కోట్లు నష్టం వచ్చిందని అఫిడవిట్లో పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్ఎంసీ ఆర్టీసీకి ఎటువంటి బకాయిలు చెల్లించబోవని, ఆర్టీసీ నష్టాలలో ఉందని ప్రభుత్వం మరోసారి గట్టిగా వాదించబోతోంది కనుక హైకోర్టు ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.