తెలంగాణ న్యాయవ్యవస్థలో పోరు వలన ఎవరికి నష్టం?

తెలంగాణ న్యాయవ్యవస్థలో హైకోర్టుకి న్యాయవాదులకి మధ్య మళ్ళీ కోల్డ్ వార్ మొదలైంది. ఇది వరకు న్యాయమూర్తులపై సస్పెన్షన్ విధించినందుకు హైకోర్టు మాజీ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్.పి.భోస్లే అలహాబాద్ హైకోర్టుకి బదిలీ అయిన తరువాత ఆయన స్థానంలో హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ రమేష్ రంగనాధన్ కూడా హైకోర్టు అడ్మినిస్ట్రేటివ్ కమిటీ సూచన మేరకు 13 మంది న్యాయవాదులకి నోటీసులు జారీ చేశారు. న్యాయవాదుల ఉద్యమ సమయంలో జిల్లాలలో న్యాయమూర్తులు, న్యాయస్థానాల పట్ల అనుచితంగా ప్రవర్తించినందుకు వారిపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో సంజాయిషీ ఇమ్మని కోరుతూ నోటీసులు జారీ చేయడంతో, అందుకు నిరసనగా న్యాయవాదులు నేడు విధులు బహిష్కరించారు.

జస్టిస్ దిలీప్.పి.భోస్లే తన వీడ్కోలు కార్యక్రమంలో మాట్లాడుతూ, “చట్టాన్ని, న్యాయవ్యవస్థ గౌరవాన్ని కాపాడేందుకే న్యాయమూర్తులు, న్యాయవాదుల పట్ల కఠినంగా వ్యవహరించవలసి వచ్చిందని చెప్పారు. ఆయన స్థానంలో బాధ్యతలు చేపట్టిన జస్టిస్ రమేష్ రంగనాధన్ కూడా అదే విధంగా తన బాధ్యతలని నిర్వర్తించారు. కనుక ఆయనని కూడా తప్పుపట్టడానికి లేదు.

ఇదే పరిస్థితి ఒకవేళ సాధారణ ప్రజలకి, సంస్థలకి లేదా రాజకీయ పార్టీలకి ఎదురైనప్పుడు, వారు హైకోర్టుతో ఏకీభవించకపోతే సుప్రీం కోర్టులో అప్పీలు చేసుకొంటారు తప్ప హైకోర్టుపై తిరుగబడరు. ఈ సంగతి ఆందోళన చేస్తున్న న్యాయవాదులకి కూడా తెలుసు. సామాన్య ప్రజల కంటే న్యాయవ్యవస్థ గౌరవాన్ని కాపాడవలసిన బాధ్యత వారిపైనే ఇంకా ఎక్కువ ఉంటుంది. కనుక వారు కూడా ఒకవేళ హైకోర్టు అభిప్రాయంతో ఏకీభవించకపోతే సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం మేలు. లేదా నేరుగా హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తితోనే మాట్లాడుకొని, అవసరమైతే లిఖిత పూర్వకంగా క్షమాపణలు చెప్పుకొని ఈ సమస్యని పరిష్కరించుకోవడం మరో మార్గం.

గోటితో పోయే దానిని గోటితోనే సరిపెట్టాలి కానీ దాని కోసం గొడ్డలి వాడితే ఎవరికీ మంచిది కాదు. న్యాయవాదులు అందరూ తమ జీవితాంతం అదే న్యాయవ్యవస్థలో, అదే హైకోర్టుకి కట్టుబడి పనిచేయాల్సి ఉంటుంది, కనుక తమ వ్యవస్థ పరువు ప్రతిష్టలని వారే కాపాడుకోవాలి. అందుకోసం ఒక మెట్టు దిగితే వారికీ, న్యాయవ్యవస్థకీ ఇంకా గౌరవం పెరుగుతుందే తప్ప ఏమాత్రం తగ్గదని గ్రహించాలి.