
సరూర్‌నగర్‌లో గురువారం సాయంత్రం జరిగిన సకలజనుల సమరభేరి బహిరంగసభకు హాజరైన ఆర్టీసీ కార్మికుడు నగునూరి బాబు (52) గుండెపోటుతో చనిపోయారు. ఆయన కరీంనగర్ డిపోలో పనిచేస్తున్నారు. సభ జరుగుతున్న ఇండోర్ స్టేడియం బయట టీ త్రాగుతుండగా కుప్పకూలిపోయాడు. వెంటనే సాటి కార్మికులు ఆయనను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన గుండెపోటుతో చనిపోయినట్లు వైద్యులు చెప్పారు.
కరీంనగర్‌కు చెందిన ఆర్టీసీ కార్మికులు తమ సహచరుడి మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి అంబులెన్స్ లో తీసుకువచ్చి డిపో ముందు ధర్నా చేయడానికి సిద్దపడ్డారు. కానీ దాని వలన పరిస్థితులు అదుపుతప్పే ప్రమాదం ఉంటుందని భావించిన పోలీసులు ఊరు శివార్లలోనే బాబు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని తీసుకువెళ్లి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. డిపో వద్ద ధర్నా చేయడానికి బయలుదేరిన ఆర్టీసీ కార్మికులను అదుపులో తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
సిఎం కేసీఆర్ మొండిపట్టుదలకు తమ సహచరుడు బలైపోయాడని ఆర్టీసీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. సిఎం కేసీఆర్ వైఖరికి నిరసనగా కరీంనగర్ జిల్లా ఆర్టీసీ కార్మిక సంఘం నేతలు, జిల్లాకు చెందిన సిపిఎం నేతలు నేడు కరీంనగర్ బంద్‌కు పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బిజెపిలు కూడా బంద్‌కు మద్దతు ఇవ్వడంతో బంద్ సంపూర్ణమైంది.