
ఆర్టీసీ సమ్మె నేటితో 27వ రోజుకు చేరుకొంది కానీ ఆర్టీసీ కార్మిక సంఘాలకు-ప్రభుత్వానికి మద్య రాజీ కుదరలేదు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుంటే, ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు సమ్మె పరిష్కారానికి ప్రత్యామ్నాయ మార్గాల కోసం వెతుకుతున్నారు. వాటిలో భాగంగా వారు బుదవారం హైదరాబాద్ శివార్లలో గల చినజీయర్ స్వామి ఆశ్రమానికి వెళ్ళి ఆయనను కలిసి తమ సమస్యలను మొరపెట్టుకొన్నారు. సిఎం కేసీఆర్కు నచ్చ చెప్పవలసిందిగా ప్రార్ధించారు. తమ అభ్యర్ధనపై చినజీయర్ స్వామి సానుకూలంగా స్పందించారని ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు చెప్పారు. ఆయన ద్వారా ఈ సమస్య పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నామన్నారు.
సిఎం కేసీఆర్కు చినజీయర్ స్వామిపై చాలా గురి, గౌరవం, భక్తి ఉన్నమాట వాస్తవమే కానీ ఆర్టీసీ సమ్మెపై సిఎం కేసీఆర్ వైఖరి గురించి తెలిసున్న చినజీయర్ స్వామి ఈవిషయంలో జోక్యం చేసుకొంటారనుకోలేము. కానీ కోర్టులు, కమిటీలు, ప్రభుత్వం పరిష్కరించలేని ఈ సమస్యను చినజీయర్ స్వామి చొరవ తీసుకొన్నట్లయితే, ఆయనపై గౌరవంతో ఇరుపక్షాలు రాజీపడే అవకాశం కూడా ఉంది. కానీ స్వామీజీ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకొంటారా? చూడాలి.