కేసీఆర్‌పై జితేందర్ రెడ్డి విమర్శలు

తెరాస మాజీ ఎంపీ, ప్రస్తుత బిజెపి నేత జితేందర్ రెడ్డి ఈరోజు తొలిసారిగా సిఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బుదవారం సాయంత్రం సరూర్‌నగర్‌లో జరిగిన సకలజనుల సమరభేరి బహిరంగసభలో మాట్లాడుతూ, “సిఎం కేసీఆర్‌ ఎన్నికలకు ముందు ఒకలాగా మాట్లాడతారు. ఎన్నికలవగానే వేరేగా మాట్లాడుతుంటారు. గతంలో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వోద్యోగులతో సమానంగా గుర్తిస్తామని చెప్పిన కేసీఆర్‌ ఇప్పుడు మా పార్టీ మ్యానిఫెస్టోలో అటువంటి హామీ ఇవ్వలేదని వాదిస్తున్నారు. కేసీఆర్‌కు ఓట్లు తప్ప ప్రజల బాగోగులు అక్కరలేదు. హుజూర్‌నగర్‌  ఉపఎన్నికలలో రూ.50 కోట్లు ఖర్చు చేసిన సిఎం కేసీఆర్‌ ఆర్టీసీ కార్మికులకు జీతాలు చెల్లించడానికి కూడా డబ్బులేదని అబద్దాలు చెపుతున్నారు. ఆర్టీసీ ఆస్తులు, అప్పుల విభజన జరుగలేదని కోర్టుకు కూడా అబద్దాలు చెపుతున్నారు. ఆర్టీసీ విభజన జరుగకపోతే మీ బందువులకు పెట్రోల్ బంకులు ఎలా వచ్చాయి? సిఎం కేసీఆర్‌ తన అనాలోచిత నిర్ణయాలు, విధానాలతో కేవలం 5 ఏళ్ళలోనే ప్రభుత్వాన్ని ఆర్ధికంగా దివాళా తీయించారు. ఇప్పుడు ఆర్టీసీ కూడా దివాళా అయిపోయిందంటూ మూసివేయడానికి సిద్దం అయ్యారు. కనుక ఆర్టీసీ కార్మికులందరూ కలిసికట్టుగా సిఎం కేసీఆర్‌తో పొరాడి ఆర్టీసీని కాపాడుకోవాలి. మీకు మేమందరం అండగా ఉన్నాము,” అని అన్నారు.