అవసరమైతే మళ్ళీ మిలియన్ మార్చ్: కోదండరాం

బుదవారం సాయంత్రం సరూర్‌నగర్‌లో జరిగిన సకలజనుల సమరభేరి బహిరంగసభలో పాల్గొన్న టిజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం మాట్లాడుతూ, “ఆర్టీసీ సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి ప్రభుత్వం ఎంతగా ప్రయత్నిస్తునప్పటికీ మీరందరూ సమైక్యంగా పోరాటం కొనసాగిస్తుండటం చాలా ఆనందం కలిగిస్తోంది. ప్రగతి భవన్‌లో సిఎం కేసీఆర్‌ ఒక్కరే మిగిలిపోయారు. ఆయన వెంట మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా లేరు. కానీ మీ వెంట అన్ని ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు, ఉపాద్యాయ, విద్యార్ది సంఘాలు రాష్ట్ర ప్రజలు ఉన్నారు. హైకోర్టు కూడా మీకే అండగా నిలబడుతోంది. 

సిఎం కేసీఆర్‌ను మొట్టమొదటిసారిగా ఇంతగట్టిగా సవాలు చేసింది టీఎస్‌ఆర్టీసీ కార్మికులే. అందుకే ఆయన సహించలేకపోతున్నారు. మీకు బలమైన నాయకత్వం  ఉంది. ప్రభుత్వం సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి ఎన్ని కుట్రలు పన్నినా మీరు చెదిరిపోకుండా, బెదిరిపోకుండా సంఘటితంగా పోరాడుతున్నారు.          

సిఎం కేసీఆర్‌ ఆర్టీసీ ఆస్తులను అమ్మివేసి కార్మికులను రోడ్డున పడేయాలని చూస్తే మేము ఊరుకోము. నిరంకుశంగా వ్యవహరిస్తున్న సిఎం కేసీఆర్‌కు ఇది ప్రజాస్వామ్యమని మనమే మళ్ళీ గుర్తు చేద్దాం. ఆర్టీసీ కార్మికులు ఎంత కష్టపడి పనిచేస్తున్నా ఏదో వంకతో ఇంక్రిమెంట్లు కోత పెట్టడం నిజమా కాదా? ఆర్టీసీ కార్మికులు ఇంతగా వేధింపులకు గురవుతున్నప్పటికీ అన్నిటినీ మౌనంగా భరిస్తూ పనిచేసుకుపోతున్నారు. వారిప్పుడు గొంతెత్తి తమ సమస్యలను పరిష్కరించమని కోరుతుంటే స్పందించకుండా సిఎం కేసీఆర్‌ అవహేళనగా మాట్లాడుతున్నారు. ఆర్టీసీ జేఏసీ నేతలను చర్చల కోసం పిలిచి వారిని నిర్బందించి సంతకాలు చేయించుకోవాలని చూశారు. కానీ వారు గట్టిగా నిలబడి పోరాడుతున్నారు. 

ఆర్టీసీ కార్మికులకు వేలరూపాయలు జీతాలు చెల్లిస్తున్నామని అయినా సమ్మెలు చేస్తూ ఆర్టీసీకి నష్టం కలిగిస్తున్నారంటూ సిఎం కేసీఆర్‌ ఆర్టీసీ కార్మికుల పట్ల చాలా అవమానకరంగా మాట్లాడుతున్నారు. మొన్న గుండెపోటుతో చనిపోయిన నార్కట్‌పల్లి డిపో ఆర్టీసీ డ్రైవర్ జమీల్‌కు నెలకు రూ.21,000 జీతం మాత్రమే వచ్చేది. దానిలో కటింగ్స్ అన్నీ పోగా ఇంటికి కేవలం రూ.9,000 మాత్రమే పట్టుకువెళ్ళేవారు. ఈ నెల అది కూడా చేతికి రాకపోయేసరికి ఎన్ని ఇబ్బందులు పడ్డారో తెలియదు కానీ ఆ ఆందోళనతోనే చనిపోయారు. సిఎం కేసీఆర్‌ చెపుతున్నట్లు ఆర్టీసీ కార్మికులకు నెలకు రూ.50,000 జీతం ఇస్తే వారెందుకు సమ్మె చేస్తారు? 

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్‌తో సహా మీ సమస్యలన్నిటినీ పరిష్కరించేవరకు కలిసికట్టుగా పోరాడుదాము. ఒకవేళ ప్రభుత్వం దిగిరాకపోతే ధర్నాలు, దీక్షలు చేద్దాం. అప్పటికీ దిగిరాకపోతే మళ్ళీ ట్యాంక్ బండ్‌పై మిలియన్ మార్చ్ నిర్వహిద్దాము,” అని అన్నారు.