
సిఎం కేసీఆర్ ఇటీవల ప్రెస్‌మీట్‌లో ఆర్టీసీ సమ్మె గురించి మాట్లాడుతున్నప్పుడు ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు కదా మీరేందుకు చేయడం లేదనే విలేఖరి ప్రశ్నకు సమాధానంగా, “ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం సాధ్యం కాదు. మరో 3-6 నెలలోనే ఏపీలో ఏమి జరుగబోతోందో అందరూ కళ్ళారా చూస్తారు,” అని అన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ఆలోచనే తప్పని వాదిస్తున్న సిఎం కేసీఆర్ ఏపీ ప్రభుత్వం విలీనం చేసి తప్పు చేసిందన్నట్లు మాట్లాడారు. అయితే ఇంతవరకు ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరూ కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందించలేదు. తొలిసారిగా ఏపీ రవానమంత్రి పేర్ని నాని బుదవారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణలో ఆర్టీసీ ప్రైవేట్ పరం కాబోతున్న సమయంలో ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే నిర్ణయం చాలా సాహసోపేతమైనది. మా ప్రభుత్వ నిర్ణయంపై తెలంగాణ సిఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను మేము సానుకూలంగా తీసుకొన్నాము. ఆయన వ్యాఖ్యలతో మాలో పంతం, పట్టుదల పెరిగింది. మరో ఆరు నెలలోగానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి విజయవంతంగా నడిపించి చూపిస్తాము,” అని అన్నారు.