
తెలంగాణ క్యాడర్‌కు చెందిన యువ ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలిని కేంద్రసర్వీసులకు బదిలీ అయ్యారు. కేంద్రప్రభుత్వం ఆమెను డిల్లీలోని కేంద్ర సచివాలయంలో డెప్యూటీ కార్యదర్శిగా పదోన్నతితో బదిలీ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌కు చెందిన ఆమె తెలంగాణ రాష్ట్రానికి విశిష్ట సేవలందించి అటు ప్రజల ఆదరాభిమానాలు, ఇటు ప్రభుత్వం మన్ననలు పొందగలిగారు. ఆమె వికారాబాద్ సబ్ కలెక్టర్, వరంగల్ రూరల్ కలెక్టర్, రంగారెడ్డి జాయింట్ కమీషనర్‌గా సేవలందించారు.
ఆమె జిల్లా కలెక్టరుగా పనిచేసినప్పటికీ, విద్యార్దులు, మహిళలు, యువతతో మమేకం అయ్యి వారికి స్పూర్తిని రగిలించే అనేక కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యంగా వరంగల్‌లో ఆమె చేపట్టిన అనేక కార్యక్రమాలతో ప్రజల మనసులు దోచుకొన్నారు. పనిచేసిన ప్రతీచోట ఆమె తనదైన ముద్రవేసి ప్రత్యేక గుర్తింపు పొందారు. అటువంటి మంచి సమర్దురాలైన యువ ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలి పదోన్నతితో కేంద్ర సర్వీసులకు వెళుతుండటం ఆనందదాయకమే కానీ అటువంటి సమర్దురాలైన అధికారిణి తెలంగాణను వీడిపోతుండటం కాస్త బాధాకరమే.