ఖమ్మంలో ఆర్టీసీ మహిళా కండక్టర్ ఆత్మహత్య

గత 24 రోజులుగా ఆర్టీసీ సమ్మె కొనసాగుతున్నప్పటికీ కనుచూపుమేర పరిష్కారం కనిపించకపోవడంతో ఆర్టీసీ కార్మికులు తీవ్ర ఆందోళనతో ఉన్నారు. ఆర్టీసీ యాజమాన్యం ఇంతవరకు సెప్టెంబర్ నెల జీతాలు చెల్లించకపోవడంతో తీవ్ర ఆర్ధిక  ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు. ఆ కారణంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి డిపోకు చెందిన నీరజ (31) అనే మహిళా కండక్టర్ సోమవారం ఉదయం తన నివాసంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొన్నారు. 

ఆత్మహత్య చేసుకొనేముందు పల్లెగూడెంలో తన తల్లిగారి ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులందరినీ పలకరించి, ఈరోజు ఖమ్మంలో జరిగే ఆర్టీసీ కార్మికుల ధర్నాలో పాల్గొనాలని చెప్పి మళ్ళీ సత్తుపల్లి తిరిగివచ్చేసి తన ఇంట్లో  ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నారు. ఉద్యోగం కోల్పోతే కుటుంబ పోషణ ఎలా? అని ఆమె భయపడుతుండేవారని, ఆ ఆందోళనతోనే ఆమె ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని నీరజ కుటుంబసభ్యులు తెలిపారు. 

 

సమాచారం అందుకొన్న పోలీసులు, ఆర్టీసీ కార్మికులు ఒకేసారి అక్కడకు చేరుకోవడంతో ప్రస్తుతం అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొనుంది. ఆర్టీసీ కార్మికుల నినాదాల మద్య పోలీసులు ఆమె మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తోటి కార్మికురాలు ఆత్మహత్య చేసుకొన్నారనే వార్త తెలియగానే సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఆర్టీసీ కార్మికులు ఖమ్మం ఆర్టీసీ డిపోను ముట్టడించి ధర్నా చేస్తున్నారు. సిఎం కేసీఆర్‌ మొండివైఖరి కారణంగానే ఆర్టీసీ కార్మికులు ప్రాణాలు తీసుకొంటున్నారని ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వథామరెడ్డి ఆరోపించారు. కనుక ఇకనైనా సిఎం కేసీఆర్‌ మొండిపట్టు వీడి ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై సానుకూలంగా స్పందించాలని విజ్ఞప్తి చేశారు.